తెలంగాణలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. వేసవికి ముందే ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్ ఏర్పడుతోంది. 

తెలంగాణలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. శుక్రవారం గరిష్టంగా 14,169 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైన సంగతి తెలిసిందే. అయితే దానిని మించి శనివారం ఉదయం విద్యుత్ డిమాండ్ ఏర్పడింది. ఈరోజు ఉదయం 10 గంటలకు 14, 350 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడినట్టుగా అధికారులు చెప్పారు. అయితే గత ఏడాది ఇదే రోజున 11,420 మెగావాట్ల విద్యుత్ వినియోగం నమోదైంది. ఇక, గత ఏడాది మార్చి 29న తెలంగాణలో అత్యధికంగా 14,166 మెగావాట్ల విద్యుత్ వినియోగం రికార్డుగా ఉంది. ఇప్పుడు దానిని అధిగమించి విద్యుత్ డిమాండ్ ఏర్పడింది. వేసవికి ముందే ఈ స్థాయిలో విద్యుత్ వినియోగం ఉందంటే.. ఎండలు పెరిగితే విద్యుత్ డిమాండ్ మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నయి. 

ఇక, తెలంగాణలో విద్యుత్ వినియోగంపై ఇంధన శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అసెంబ్లీలో శుక్రవారం మాట్లాడుతూ.. శుక్రవారం గరిష్టంగా 14,169 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదై సరికొత్త రికార్డు సృష్టించిందని ప్రకటించారు. ఇంకో వెయ్యి మెగావాట్ల వరకు డిమాండ్​పెరిగే చాన్స్ ​ఉందన్నారు. అయినా అంతరాయం లేకుండా విద్యుత్ అందిస్తామని చెప్పారు. 

‘‘గత కొన్ని రోజులుగా నిర్వహణ, మరమ్మతుల కారణంగా నిరంతర విద్యుత్ సరఫరాలో చిన్నపాటి అంతరాయాలు ఉన్నాయి. కానీ నేటి నుంచి అన్ని రంగాలకు పునరుద్ధరించబడింది’’ అని జగదీష్ రెడ్డి చెప్పారు. జాతీయ సగటు 1,255 యూనిట్లు ఉంటే.. తెలంగాణలో తలసరి విద్యుత్ వినియోగం 2,166 యూనిట్లుగా ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ తీసుకుంటున్న చర్యల కారణంగా స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 2014లో 7,778 మెగావాట్లు ఉంటే 2022 నాటికి 18,460 మెగావాట్లకు పెంచామని వివరించారు.

రాష్ట్రంలో విద్యుత్ సరఫరాను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం పొందిన రుణాలపై ఆంక్షలతో పాటు అనవసరమైన అడ్డంకులు సృష్టిస్తోందని కేంద్రంపై మంత్రి మండిపడ్డారు.