కావాలనే రాజాసింగ్ మాటలు వక్రీకరించి, పీడీయాక్ట్.. హైకోర్టుకు ఎమ్మెల్యే వాదన

కావాలనే ఎమ్మెల్యే మాటలను వక్రీకరించి.. ఆయనపై పీడీయాక్ట్ పెట్టారని హైకోర్టులో రాజాసింగ్ తరఫు న్యాయవాది చెప్పుకొచ్చారు. 

PD Act on Raja Singh case hearing in telangana highcourt

హైదరాబాద్ :  మహమ్మద్ ప్రవక్తపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎలాంటి ఆరోపణలు చేయలేదని, కొందరు కావాలని ఆయన మాటలను వక్రీకరించారని ఆయన తరఫు న్యాయవాది హైకోర్టులో వివరించారు. ప్రవర్తన చెడుగా చిత్రీకరించి సోషల్ మీడియాలో రాజాసింగ్ పోస్ట్ చేశారని అభియోగాలకు ఆధారమైన ట్రాన్స్ లేషన్ చేసిన వ్యక్తి ఎవరో పోలీసులు ఇంతవరకు వెల్లడించలేదని అన్నారు.  రాజకీయ కుట్రలో భాగంగా రాజాసింగ్ పై పీడీ యాక్ట్ నమోదు చేశారని, దాన్ని రద్దు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే భార్య టి. ఉషాబాయి  హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

రాజా సింగ్ 12 నెలల పాటు జైల్లో ఉంచేందుకు వీలుగా ప్రభుత్వం జారీ చేసిన జీవో 90ని కొట్టి వేయాలని కోరుతూ ఆమె అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్ ఎ.అభిషేక్ రెడ్డి, జస్టిస్ జె.శ్రీదేవి ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది.  పిటిషనర్ తరఫున ఎల్. రవిచందర్ వాదనలు వినిపించారు. రాజా సింగ్ పై ఉన్న కేసుల్లో కింది కోర్టు రిమాండ్ కు పంపేందుకు నిరాకరించిందని గుర్తు చేశారు. దీంతో ఉద్దేశపూర్వకంగా ఆయనపై తప్పుడు ఆరోపణలు చేసి పిడియాక్ట్ ప్రయోగించారని చెప్పారు. గత పదేళ్ళలో రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేసిన పీడీ యాక్ట్ కేసును కోర్టు కొట్టివేసింది అని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు.

నేడు ఢిల్లీ పర్యటనకు వెళుతున్న గవర్నర్ తమిళిసై.. వివరాలు ఇవే..

ఎస్సీ ఉత్తర్వులకు విరుద్ధంగా…
గతంలో ఇచ్చిన సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా రాజా సింగ్ పై పీడీయాక్ట్ ప్రయోగించారని అన్నారు. ప్రవక్తను రాజా సింగ్ ‘ఆకా’ అనే పదంతో ఉచ్చరించారనడాన్ని న్యాయవాది వ్యతిరేకించారు. ఆకా అంటే పెద్దన్న అని అర్థం అని చెప్పారు. ప్రవక్త గురించి రాజా సింగ్ తప్పుగా మాట్లాడినట్లు  వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని, ఆ వీడియోలోని వాయిస్ అయినది కాదని అన్నారు. 50 ఏళ్ల వ్యక్తి ఆరేళ్ల బాలికను వివాహం చేసుకోవడం గురించి మాత్రమే ఆగస్టు 22న రాజాసింగ్ మాట్లాడారని చెప్పారు.  రాజా సింగ్ పై పీడీయాక్ట్ ప్రయోగించడానికి పోలీసులు చూపుతున్న 15 కేసులో ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు. ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్ ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాది సదాశివుని మూజీబ్ కుమార్ గతవారం వాదనలు వినిపించారు. తదుపరి వాదనలు  నేడు కొనసాగనున్నాయి.

ఇదిలా ఉండగా, అక్టోబర్ 29న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పీడీ చట్టం కింద నిర్బంధించడాన్ని సలహామండలి ఆమోదించిందని, దీంతో 12 నెలల పాటు నిర్భంధిస్తూ ఈ నెల 19న ఉత్తర్వులు జారీ చేశామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఆగస్టు 25న రాజాసింగ్ ను పీడీ చట్టం కింద అరెస్టు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆయన భార్య ఉషాభాయ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

దీనిపై  జస్టిస్ ఎ. అభిషేక్ రెడ్డి, జస్టిస్ జె శ్రీదేవిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ముజీబ్ కుమార్ సదాశివుని వాదనలు వినిపించారు. రాజాసింగ్  కొన్ని వర్గాలను రెచ్చగొట్టేలా టీవీల్లో ప్రసంగించిన అంశాలను పరిగణలోకి తీసుకుని పీడీ చట్టంకింద నిర్బంధించారని, దాన్ని సలహా మండలి ఆమోదించిందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. 

ఈ నేపథ్యంలో ప్రభుత్వం అక్టోబర్ 19న తాజాగా జీవో జారీ చేసిందని చెప్పారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ.. చట్ట నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసిందని అన్నారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాలు చేశారా? అని ప్రశ్నించారు. సవరణ పిటిషన్ దాఖలు చేస్తామని న్యాయవాది చెప్పడంతో ధర్మాసనం విచారణను అక్టోబర్ నెల 31వ తేదీకి వాయిదా వేసింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios