టీఆర్ఎస్ లో అసంతృప్తి రోజు రోజుకీ పెరిగిపోతుందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ అన్నారు. టీఆర్ఎస్ లో ఏక్షణమైనా విస్ఫోటనం జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఆ పార్టీలో పదవులు రానివారంతా అసంతృప్తితో ఉన్నారని..మంత్రి ఈటల రాజేందర్‌, ఎమ్మెల్యే రసమయి సీఎం కేసీఆర్‌పై బహిరంగంగానే విమర్శలు చేశారని గుర్తు చేశారు. 

సోమవారం సూర్యాపేటలో, మఠంపల్లి మండలం గుండ్లపల్లిలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 40లక్షల జ నాభా ఉన్న మాదిగలకు మంత్రివర్గంలో చోటు కల్పించకుండా మోసం చేశారన్నారు. ఆంధ్రా పెత్తనం వద్దంటూ చెబుతున్న మంత్రి జగదీశ్‌రెడ్డి.. హుజూర్‌నగర్‌లో అధికారులను ఆంధ్రా నుంచే తెప్పించుకున్నారని ఆరోపించారు. 

పోలీసులతో కలిసి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని, జగదీశ్‌రెడ్డి లాంటి వ్యక్తిని తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదన్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తలను భయాందోళనకు గురిచే స్తూ అక్రమ కేసులను బనాయిస్తూ టీఆర్‌ఎస్ లో చేర్చుకుంటున్న సంగతి ప్రజలకు తెలుసన్నారు. పోలీసుల తీరు ను నిరసిస్తూ సామూహిక నిరవధిక నిరాహార దీక్ష చేయనున్నట్లు తెలిపారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.