తెలుగు సినిమాను మరో మెట్టు ఎక్కించిన అద్భుత చిత్రం ఆర్ఆర్ఆర్ కు ప్రతిష్టాత్మక ఆస్కార్ అవాార్డు దక్కడంపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్పందించారు.
హైదరాబాద్ : తెలుగు సినిమా 'ఆర్ఆర్ఆర్' సినిమా ఇప్పటికే అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందగా తాజాగా ఆస్కార్ అవార్డును పొంది భారత కీర్తి పతాకాన్ని మరోసారి ప్రపంచ వేదికపై రెపరెపలాడించింది. ఈ మూవీలోని అద్భుతమైన పాట 'నాటు నాటు' అభిమానుల మనసులనే కాదు తాజాగా ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ కు నామినేట్ అయిన నాటు నాటు సాంగ్ సినీప్రియుల కలను నెరవేరుస్తూ ఆస్కార్ ను దక్కించుకుంది. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
భారతీయ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కిందని... అది తెలుగు సినిమా ద్వారా దక్కడం గర్వకారమని పవన్ అన్నారు. ఆస్కార్ వేదికపై తెలుగు పాట వినిపించడం, తెలుగోళ్లు అవార్డును అందుకోవడం చూసి తెలుగు ప్రేక్షకుల గుండెలు ఉప్పొంగుతున్నాయని అన్నారు. ఇవి యావత్ భారతదేశం గర్విస్తున్న క్షణాలని పవన్ పేర్కొన్నారు.
ప్రతి భారతీయుడు గర్వపడేలా అంతర్జాతీయ స్థాయికి మన సినిమా వెళ్లడం... ఇప్పుడు ఆస్కార్ అవార్డును గెలుచుకోవడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. అద్భుతమైన పాటకు ప్రాణంపోసిన ఆర్ఆర్ఆర్ సంగీత దర్శకుడు కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డును అందుకున్నారని... వారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నానని పవన్ అన్నారు. తెలుగు పదాలను అందంగా కూర్చి ప్రతి ఒక్కరితో పాదం కలిపేలా చేసి హుషారెత్తించింది ఈ నాటు నాటు సాంగ్. ఆ హుషారు ఆస్కార్ వేదికపైనా కనిపించిందని... ఈ పాట ప్రతిష్టాత్మక వేదికపై ప్రదర్శితమవడమే కాదు అవార్డును కుడా దక్కించుకోవడం భారత సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందని పవన్ కల్యాణ్ అన్నారు.
Read More ఆస్కార్ గెలుచుకున్న నాటు నాటు పాట : రామ్ చరణ్ భార్య ఉపాసన రియాక్షన్ ఏంటంటే..
తెలుగు సినిమాను మొదట బాహుబలి ద్వారా జాతీయ స్థాయికి, ఆర్ఆర్ఆర్ ద్వారా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నానని పవన్ అన్నారు.ఇక ఆర్ఆర్ఆర్ మూవీలో అద్భుత నటనతో స్వాతంత్ర్య సమరయోధుల పాత్రల్లో ఒదిగిపోయిన హీరోలు ఎన్టీఆర్, రాంచరణ్ ను అభినందించకుండా వుండలేమన్నారు. నాటు నాటు పాటకు మరింత ప్రత్యేకంగా తీర్చిదిద్దిన గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, డ్యాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ ను పవన్ అభినందించారు. భారీ ఖర్ఛుతో కూడుకున్న సినిమాను ఏ మాత్రం వెనకడుగు వేయకుండి గ్రాండ్ గా రూపొందించిన నిర్మాత దానయ్యను కూడా అభినందించారు.
ఆస్కార్ అవార్డుగా విజేతగా నిలిచిన ఆర్ఆర్ఆర్ భారత దర్శకులు, నటులు, రచయితలకు స్పూర్తినిచ్చిందని పవన్ అన్నారు. ఇలా భారత సినిమా ప్రపంచ స్థాయిలో మరిన్ని అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నానని అన్నారు. తెలుగు సినిమాకు ఆస్కార్ దక్కిందని తెలియగానే ఎంతో సంతోషపడ్డానని పవన్ అన్నారు.
