తెలంగాణ ముందస్తుపై మౌనమేలనోయి పవన్

First Published 7, Sep 2018, 6:55 PM IST
pawan kalyan not responding on early elections
Highlights

ముందస్తు ఎన్నికలు నేపథ్యంలో తెలంగాణలోని రాజకీయాలు రోజు రోజుకి రసవత్తరంగా మారతున్నాయి. తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసిన కేసీఆర్, వెంటనే అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ప్రకటించేశారు. అంతేకాదు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం సైతం చుట్టారు. అటు కాంగ్రెస్ పార్టీ సైతం ఎన్నికలకు తాము రెడీ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. 

హైదరాబాద్: ముందస్తు ఎన్నికలు నేపథ్యంలో తెలంగాణలోని రాజకీయాలు రోజు రోజుకి రసవత్తరంగా మారతున్నాయి. తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసిన కేసీఆర్, వెంటనే అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ప్రకటించేశారు. అంతేకాదు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం సైతం చుట్టారు. అటు కాంగ్రెస్ పార్టీ సైతం ఎన్నికలకు తాము రెడీ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. 
ఇప్పటికే మేనిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్ 50 మంది జాబితాతో అభ్యర్థుల తొలిజాబితా విడుదల చెయ్యనుంది. అటు బీజేపీ సైతం ఆరు నెలల నుంచే ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటించేసింది. టీడీపీ కూడా అలర్ట్ అయ్యింది.

అన్ని పార్టీలు అలర్ట్ అయినా జనసేన పార్టీ మాత్రం అలర్ట్ కాలేదు. ముందస్తు ఎన్నికలపై కనీసం స్పందించడం లేదు. తెలంగాణ ఎన్నికల్లో అన్ని పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతుంటే జనసేనాని మాత్రం కనుచూపుమేరలో కనిపించడం లేదు. జనసేన ఎందుకు మౌనంగా ఉందో అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. 

గతంలో తెలంగాణలో కూడా తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్ని పార్టీలు ముందస్తు ఎన్నికలకు ప్రణాళికలు రచిస్తుంటే ఉలుకుపలుకు లేకుండా ఉండటం చర్చనీయాంశంగా మారింది. 
 
తెలంగాణలో జనసేన పోటీ చేయ్యాలనుకుంటే కార్యచరణ ఇప్పటికే ప్రారంభించాలి..కానీ అలాంటిదెక్కడా కనబడటం లేదు. ఒకవేళ పోటీ చేస్తే పార్టీకి క్యాడర్ ఎక్కడ ఉంది...బాధ్యులు ఎవరున్నారు.....అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. తెలంగాణలో పోటీ చేస్తామని ఇప్పటి వరకు స్పందించకపోవడంతో పవన్ తెలంగాణలో పోటీ చెయ్యరా అన్న సందేహాలు నెలకొన్నాయి.  

వాస్తవానికి తెలంగాణలో ఎలాంటి క్యాడర్ లేకపోవడం, పార్టీ నిర్మాణం ప్రాథమికంగా కూడా పూర్తికాకపోవడంతో ఈ సమయంలో పోటీ చేస్తే ఫలితాలు దారుణంగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణలో ప్రతికూల ఫలితాలు వస్తే ఇక ఏపీలో ఇబ్బందికర పరిస్థితి నెలకొనే అవకావం ఉందంటున్నారు. పవన్ మౌనం చూస్తుంటే.. ఈసారికి తెలంగాణ ఎన్నికల రేసులో జనసేన దూరంగా ఉంటున్నట్లేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈసారిక తెలంగాణ అసెంబ్లీకి పవన్ కళ్యాణ్ పోటీ చెయ్యకుండా ఉండటమే బెటర్ అనే అభిప్రాయం అభిమానుల నుంచి కూడా వెలువడుతుంది. 

loader