వరంగల్ అర్బన్ జిల్లా కోటిలింగాలలోని భద్రకాళీ ఫైర్ వర్క్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది మరణించిన ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. అగ్నిప్రమాదంలో పదకొండు మంది కార్మికులు చనిపోవడం చాలా బాధాకరమైన విషయమని.. మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలకు తావు లేకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలని పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.