జనసేన పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేత రాజు రవితేజ్ గుడ్‌బై చెప్పారు. పవన్ కల్యాణ్ బాగా మారిపోయారని, ప్రస్తుతం ఆయన ద్వేషతో నడిచే ప్రమాదకరమైన శక్తి అంటూ ఓ ప్రకటనలో తెలిపారు. 

‘‘ శ్రీ పవన్ కల్యాణ్ గారితో కానీ, జనసేన పార్టీతో కానీ ఇక నుంచి నాకు ఎటువంటి సంబంధం లేదని, ఉండబోదని, అందరూ గమనించాలని నేను కోరుకుంటున్నాను.

పార్టీ భావజాలం, మరియు పార్టీ రాజ్యాంగాన్ని సృష్టించి, పార్టీని ప్రారంభించడంలో కీలక పాత్ర పోషించిన పార్టీ మొదటి ప్రధాన కార్యదర్శని నేను.

ప్రస్తుతం నేను పార్టీ పొలిటిబ్యూరో సభ్యుడిని, శ్రీ కల్యాణ్ గారి కోరిక మేరకు నేను ఈ పదవి ఇష్టం లేకపోయినా అంగీకరించాను. ఇక మీదట నేను శ్రీ కల్యాణ్ గారితో కలిసి పనిచేయను, అతనితో లేదా జనసేన పార్టీతో సంబంధం కలిగి ఉండను. 

ఒకప్పుడు మంచి వ్యక్తి అయిన పవన్ కల్యాణ్ గారు కక్షసాధింపుతనం మరియు కుల, మతపరమైన ద్వేషంతో నడిచే ప్రమాదకరమైన విభజన శక్తిగా మారిపోయాడు. రాజకీయ లేదా సామాజిక శక్తి ఉన్న పదవిని ఆక్రమించటానికి అతన్ని అనుమతించకూడదు. శ్రీ కల్యాణ్ గారు ఎటువంటి రాజకీయ అధికారానికి అర్హుడు కాడు.

అర్హత లేకుండా పొందినది, అనుమతి లేకుండా వెళ్లిపోతుంది. ’’ అంటూ రాజు రవితేజ్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఆ వెంటనే రాజు రవితేజ్ రాజీనామాను ఆమోదించినట్లు జనసేన ఒక ప్రకటనలో తెలిపింది. 

ఆయన పార్టీ పట్ల వ్యక్తం చేసిన ఆవేదనను, అభిప్రాయాలను గౌరవిస్తున్నామని గతంలో కూడా ఆయన ఇటువంటి బాధతోనే పార్టీని వీడి తిరిగి పార్టీలోకి వచ్చారని ఆయనకు మంచి భవిష్యత్తు. ఆయన కుటుంబానికి శుభం కలగజేయాలని ఆ జగన్మాతను ప్రార్థిస్తున్నట్లు పవన్ కల్యాణ్ పేరిట ఓ ప్రకటన విడుదలయ్యింది.