ప్రజారాజ్యం ద్వారా ఎదురైన అనుభవాలతో అన్నీ వర్గాల మద్దతు కోసం పవన్ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు కనబడుతోంది.

పాదయాత్ర చేయబోతున్నట్లు చేసిన ప్రకటన ద్వారా వచ్చే ఎన్నికలపై సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చాలా సీరియస్ గా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెప్పటం వల్లే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశ్యంతో ఇప్పటి నుండే గట్టి పునాదులు వేసుకోవాలన్న ఆలోచనతో ఉన్నట్లు కనబడుతోంది.

ఇందులో భాగంగానే అనంతపురంలో బహిరంగ సభ, గుత్తిలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్ధులతో ముఖాముఖి అంతా పక్కా ప్లానింగ్ తోనే సాగింది. ప్రస్తుతం రాష్ట్రంలో అధికార టిడిపి, ప్రధాన ప్రతిపక్ష వైసీపీలు మాత్రమే ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ టిడిపితో అధికారాన్ని పంచుకుంటున్నా వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ నిర్వహించబోయే పాత్రపై కమలనాధులకే స్పష్టత లేదు. దాంతో వచ్చే ఎన్నికల్లో పోటీ ప్రధానంగా టిడిపి-వైసీపీ మధ్యే ఉంటున్నదనటంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు.

 గడచిన రెండున్నరేళ్ళ టిడిపి పరిపాలనలో ప్రజల్లో పలు కారణాలతో అంసతృప్తిగా ఉన్నారు. గడచిన ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుపడుతుందని వాదించిన వాళ్ళలో కాలం గడిచేకోద్దీ స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అంతేకాకుండా పోయిన ఎన్నికల్లో చంద్రబాబును సిఎం చేసిన రాజకీయ సమీకరణలన్నీ వచ్చే ఎన్నికల్లో ఏ మేరకు పనికొస్తాయో సందేహమే. ఆ విషయాలను గ్రహించటంతోనే టిడిపి వర్గాల్లో ఒక విదమైన ఆందళన మొదలైంది. ఈ పరిస్ధితుల్లో వచ్చే ఎన్నికల్లో టిడిపి ఏ మేరకు గట్టి పోరాటం చేస్తుందన్నది అనుమానమే.

 ఇక, వైసీపీ విషయంలో కూడా ప్రజలు ఏ మేరకు సానుకూలంగా ఉన్నారన్నది తెలియటం లేదు. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆందోళనల్లో కొంత వరకూ ప్రజలు ప్రధానంగా యువత స్పందిస్తున్నప్పటికీ సమయం వచ్చినపుడు ఏ మేరకు మద్దతుగా నిలబడుతారో చూడాలి. వీరి పరిస్ధితే ఈ విధంగా ఉంటే కాంగ్రెస్, వామపక్షాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.

ఇటువంటి పరిస్ధితులను నిశితంగా గమనించిన పవన్ వచ్చే ఎన్నికల సమయానికి రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉంటుందని గట్టిగా నమ్ముతున్నట్లు సమాచారం. కాబట్టి ఇప్పటి నుండే గట్టి పునాదులు వేస్తే ఎన్నికల్లో విజయం సాధించటం అంత కష్టం కాదని అంచనా వేసుకున్నట్లే కనబడుతోంది. అందుకు అనుగుణంగానే పవన్ ప్రజల్లో మమేకం అయ్యేందుకు ప్రణాళికలు వేసుకున్నారు ఇందులో భాగంగానే ఇంజనీరింగ్ కళాశాల విద్యార్ధులతో సమావేశం. అదికూడా టిడిపికి గట్టి పట్టున్న అనంతపురం జిల్లా నుండే కావటం గమనార్హం.

కళాశాలలో మాట్లాడుతూ, త్వరలో పాదయాత్ర చేస్తానని, అనంతపురం జిల్లాలో కూడా పాదయాత్ర ఉంటుందని గట్టగా చెప్పారు. అదే విధంగా రిజర్వేషన్ల అంశంపై మాట్లాడుతూ, సమాజంలోని అన్నీ సామాజిక వర్గాలకు దగ్గరయ్యేందుకే ప్రయత్నించినట్లు కనబడుతోంది. అందుకే రిజర్వేషన్లపై తన అభిప్రయాలు స్పష్టంగా బయటపడకుండా జాగ్రత్త పడ్డారు.

అలాగే, సమాజంలో ఎక్కువ శాతం ఉన్న రైతాంగాన్ని దగ్గర చేసుకునేందుకు ప్రయత్నించారు. ఇక, అత్యాచారాలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ మహిళలు, విద్యార్ధినులను ఆకర్షించేందుకు ప్రయత్నించారు. మొత్తం మీద ప్రజారాజ్యం ద్వారా ఎదురైన అనుభవాలతో అన్నీ వర్గాల మద్దతు కోసం పవన్ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు కనబడుతోంది.

 ఫైనల్ గా టిడిపి, భాజపా నేతలకు ఓట్లు వేయవద్దని గట్టిగానే చెప్పారు. ప్రత్కేకహోదా, కరువు తదితరాలపై అబద్దాలు చెబుతున్న పార్టీలకు ఓట్లు వేయమని చెప్పమని స్పష్టంగా పిలుపునిచ్చారు. దాంతో వచ్చే ఎన్నికల్లో జనసేన ఒంటిరిగానే పోటీ చేయాలని అనుకుంటున్నట్లుగా సంకేతాలు పంపారు. సమస్యల పరిష్కారానికి గ్రామం మాత్రమే కాదని, మొత్తం రాష్ట్రాన్నే దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలన్న దాహం తనకుందని చెప్పటంతోనే వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసినట్లు పవన్ రాష్ట్రానికి సూటిగానే సిగ్నల్స్ పంపారు.