కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కు ఊహించని షాక్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కాపు రిజర్వేషన్ల పేరుతో ఎపి సర్కారుకు చెమటలు పట్టిస్తున్న ముద్రగడను పవన్ అయోమయంలోకి నెట్టేశారు. గుంటూరులో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ చేసిన కామెంట్స్ కాపు రిజర్వేషన్ల డిమాండ్ పై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంతకూ జనసేన సభలో పవన్ ఏమన్నారు? ముద్రగడకు షాక్ ఎందుకు అనుకుంటున్నారా? అయితే చదవండి మరి.

సభలో పవన్ కళ్యాణ్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. సరికొత్త రాజకీయ సమీకరణాలను నెలకొల్పే దిశగా పవన్ ప్రసంగం సాగింది. అయితే పనిలో పనిగా టిడిపి అధినేత చంద్రబాబుపై తీవ్రమైన భాషలో విరుచుకుపడ్డారు పవన్. కాపు రిజర్వేషన్ల పేరుతో కాపులను ఎందుకు మోసం చేస్తున్నారని పవన్ ప్రశ్నించారు. ఎన్నికల ముందు కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని సాధ్యం కాని హామీలు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు.

పవన్ కామెంట్స్ కాపు రిజర్వేషన్ల కోసం పోరాడే శక్తులకు కంటగింపుగానే మారే చాన్స్ ఉందంటున్నారు. పవన్ కళ్యాణ్ కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ ఆయన కాపు రిజర్వేషన్లు సాధ్యం అయ్యే చాన్సే లేదని క్లారిటీ ఇచ్చేశారు. ఇంతకాలం అధికార టిడిపి కాపులను మభ్యపెడుతూ మోసం చేసిందన్న భావనతో పవన్ కామెంట్స్ చేశారు. అమలు కాని రిజర్వేషన్ల హామీ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించడం ద్వారా కాపు రిజర్వేషన్ల డిమాండ్ సాధ్యమయ్యే పని కాదన్న ఉద్దేశాన్ని పవన్ వెల్లడించారు.

అంతేకాదు ఈ సందర్భంగా పవన్ మరో ఆసక్తికరమైన కామెంట్ చేశారు. కొన్ని కులాలకే రాజ్యాధికారం పరిమితం కారాదని, బిసిల్లోని అన్నికులాలకు కూడా రాజ్యాధికారంలో వాటా రావాల్సిందే అని ప్రకటించారు.  కాపు రిజర్వేషన్లు అసాధ్యం అని ప్రకటించి తన నిజాయితీని పవన్ ప్రకటించుకున్నారని చెబుతున్నారు. మరోవైపు కాపు రిజర్వేషన్ల హడావిడి కారణంగా ఎపిలో భయం భయంగా ఉన్న బిసి వర్గాలకు సైతం పవన్ చేరువయ్యారని అంటున్నారు. ఎందుకంటే కాపు రిజర్వేషన్లు అసాధ్యం అని ఒక కాపు బిడ్డ చెప్పడం చూస్తే ఇందులో వాస్తవమే ఉంటుందన్న భావన బిసి వర్గాల్లో కలగడం ఖాయమంటున్నారు. తద్వారా ఇటు కమ్మ, అటు రెడ్డి కులాల మధ్య నలిగిపోతున్న బిసిల చూపు పవన్ వైపు మళ్ళే చాన్స్ ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు నిజం నిప్పులాంటిదని సూటిగా చెప్పి కాపుల్లోనూ ఉన్న భ్రమలు తొలగించి కాపు వర్గం మద్దతు కూడా పవన్ సాధించినట్లేనన్న ప్రచారం షురూ అయింది.

మొత్తానికి కాపు రిజర్వేషన్ల పేరుతో పోరాటం చేస్తున్న ముద్రగడ కు వాయిస్ లేకుండా పవన్ చేశారన్న వాదన తెరపైకి వచ్చింది. మరి పవన్ ప్రకటన మీద ముద్రగడ స్టెప్ ఎలా  ఉంటుందో చూడాలి మరి.