పటాన్‌చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌ గౌడ్ టీడీపీలో చేరనున్నారు


హైదరాబాద్: పటాన్‌చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌ గౌడ్ టీడీపీలో చేరనున్నారు. ఈ నెల 19 వ తేదీన తన అనుచరులతో కలిసి నందీశ్వర్‌గౌడ్ టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.

సోమవారం నాడు టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణతో నందీశ్వర్‌గౌడ్ భేటీ అయ్యారు. పటాన్‌చెరువు నుండి టీడీపీ అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగనున్నారు. 

ఇటీవలనే అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో నందీశ్వర్‌గౌడ్ సమావేశమయ్యారు.పటాన్ చెరువు టిక్కెట్టును తనకు ఇవ్వాలని ఆయన కోరారు. ఇదే విషయమై ఎల్. రమణతో నందీశ్వర్ గౌడ్ సోమవారం నాడు చర్చించారు.

2009 ఎన్నికల్లో పటాన్ చెరువు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా నందీశ్వర్ గౌడ్ విజయం సాధించారు. మాజీ పీసీసీ చీఫ్ డి.శ్రీనివాస్‌కు అత్యంత సన్నిహితుడుగానందీశ్వర్‌గౌడ్‌కు పేరుంది.

2014 ఎన్నికల తర్వాత నందీశ్వర్ ‌గౌడ్ బీజేపీలో చేరారు.డీఎస్ కూడ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరారు. డీఎస్ కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారు.

ఈ తరుణంలోనే నందీశ్వర్ గౌడ్‌ బీజేపీకి గుడ్ బై చెప్పారు. టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు. డీఎస్ తో పాటు నందీశ్వర్ గౌడ్ కూడ కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం సాగింది. కానీ, అనుహ్యంగా నందీశ్వర్ గౌడ్ టీడీపీని ఎంచుకొన్నారు. కాంగ్రెస్ పార్టీలో నందీశ్వర్ గౌడ్ కు టిక్కెట్టుపై తీవ్ర పోటీ ఏర్పడే అవకాశం ఉందని ప్రచారం ఉన్న నేపథ్యంలోనే ఆయన టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారని ప్రచారం సాగుతోంది.