పాస్ పోర్టు @ వరంగల్

passport centre at warangal soon
Highlights

  • పాస్ పోర్టు కేంద్రం ఏర్పాటుకు ఆమోదించిన సీఎం
  • విదేశీ వ్య‌వ‌హారాల కార్య‌ద‌ర్శితో మాట్లాడిన  కేసిఆర్

వ‌రంగ‌ల్ ప్ర‌జ‌ల‌కు శుభ‌వార్త‌. ఇక పాసుపోర్టు కోసం హైదరాబాద్ కు వచ్చి రోజుల తరబడి వేచిచూడాల్సిన అవసరం లేదు. వ‌రంగ‌ల్ మ‌హా న‌గ‌రంలో  పాసుపోర్టు కేంద్రం ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారు. ప్ర‌స్తుతం వ‌రంగ‌ల్ నుంచి విదేశాల‌కు విద్య, ఉపాధి, ప‌ర్య‌ట‌న కోసం వెళ్లే  వారి సంఖ్య విపరీతంగా పెరుగతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వరంగల్ కేంద్రంగా పాస్టు పోర్టు కార్యాలయం ఏర్పాటుకు చొరవతీసుకొని సీఎంతో మాట్లాడారు. దీనికి అంగీకరించిన సీఎం తన కార్యాలయానికి వచ్చిన విదేశీ వ్య‌వ‌హారాల శాఖ కార్య‌ద‌ర్శి దానేశ్వ‌ర్, రీజిన‌ల్ పాస్ పోర్టు ఆఫీస‌ర్ స‌త్తార్, కో ఆర్డినేట‌ర్ విష్ణుల‌ దృష్టికి ఈ విషయాన్ని తీసుకొచ్చారు.

 

వ‌రంగ‌ల్ న‌గ‌రంలో పెరుగుతున్న విదేశీ ప్ర‌యాణికుల నేప‌థ్యంలో అక్క‌డ పాస్ పోర్టు సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయాల‌ని ముఖ్య‌మంత్రి వారిని కోరారు. దీనికి విదేశీ వ్య‌వ‌హారాల శాఖ కార్య‌ద‌ర్శి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. అన్ని వ‌స‌తులు క‌ల్పిస్తే నెల రోజుల్లో సేవా కేంద్రాన్ని వ‌రంగ‌ల్ లో ప్రారంభిస్తామ‌ని హామీ ఇచ్చారు.

 

విదేశీ వ్య‌వ‌హారాల కార్య‌ద‌ర్శి మూలే అంగీక‌రించ‌డంతో వ‌రంగ‌ల్ లో పాస్ పోర్టు సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయ‌డానికి కావల్సిన వ‌స‌తులు వెంట‌నే ఏర్పాటు చేయాల‌ని ఉప‌ముఖ్య‌మంత్రి  క‌డియం శ్రీహ‌రి స్థానిక అధికారులను ఆదేశించారు. అనుకున్న స‌మ‌యంలో పాస్ పోర్టు సేవా కేంద్రం ప‌నిచేసే విధంగా రీజిన‌ల్ పాస్ పోర్టు అధికారి స‌త్తార్, కో ఆర్డినేట‌ర్ విష్ణులు స‌హ‌క‌రించాల‌ని కోరారు. దీంతో నెల రోజుల్లో ఓరుగల్లు మ‌హా న‌గరంలో ప్ర‌జ‌లు అక్క‌డే పాస్ పోర్టు పొందే అవ‌కాశం పొంద‌నున్నారు. విద్యా కేంద్రంగా ఉన్న వ‌రంగ‌ల్ ఐటి హ‌బ్ ఏర్పాటుతో ఐటీ రెండో కేంద్రంగా మార‌నుంది. ప్ర‌స్తుతం పాస్ పోర్టు సేవా కేంద్రం కూడా రానుండ‌డంతో వ‌రంగ‌ల్ నుంచి విదేశాల‌కు వెళ్లే వారికి పాస్ పోర్టు పొంద‌డం సుల‌భ‌త‌రం కానుంది.

 

వ‌రంగ‌ల్ లో పాస్ పోర్టు సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు వెంట‌నే అంగీక‌రించిన కేసిఆర్ కు, విదేశీ వ్య‌వ‌హారాల శాఖ కార్య‌ద‌ర్శికి క‌డియం శ్రీహ‌రి ఈ సందర్భంగా ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ కేంద్రం వ‌రంగ‌ల్ లో ఏర్పాటు కావడం వ‌ల్ల వ‌రంగ‌ల్ కే కాకుండా చుట్టుప‌క్క‌ల‌నున్న జిల్లాల వారంద‌రికి కూడా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని తెలిపారు.

 

loader