TSRTC: బస్సు ఎక్కి కండక్టర్ బుగ్గ కొరికిన ప్రయాణికుడు.. ఎందుకు?
ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడు వీరంగం సృష్టించాడు. టికెట్ తీసుకుని కూర్చోవడానికి సీటు చూపించాలని కండక్టర్ పై అరిచాడు. లేదంటే తన డబ్బులు తనకు ఇచ్చేయాలని డిమాండ్ చేశాడు. కండక్టర్ టికెట్ డబ్బులు తిరిగి ఇచ్చేశాక.. బస్సు దిగిన ఆ ప్రయాణికుడు మళ్లీ.. బస్సు ఎక్కి కండక్టర్ బుగ్గ కొరికాడు.
TSRTC: తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో ఎప్పుడూ చూడని ఘటనలు జరుగుతున్నాయి. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం రావడంతో బస్సుల్లో మెజార్టీ ప్రయాణికులు మహిళలే కనబడుతున్నారు. దీంతో టికెట్ తీసుకున్న తాము నిలబడాలా? అంటూ ఓ వ్యక్తి చేసిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తన భార్య కోసం బస్సు ఆపకపోవడంతో ఓ వ్యక్తి డ్రైవర్‌పై దాడికి దిగన ఘటన కూడా సంచలనమైంది. సిబ్బందిపై దూషణకు దిగాడు. తాజాగా, మరో ఘటన కూడా సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిపోయింది. ఓ ప్రయాణికుడు కండక్టర్ బుగ్గ కొరికాడు.
ఈ ఘటన ఆదిలాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో చోటుచేసుకుంది. ఆ బస్సు పొరుగునే ఉన్న మహారాష్ట్రలోని పాండ్రకవడ గ్రామానికి వెళ్లింది. తిరిగి అదే దారిలో ఆదిలాబాద్‌కు బయల్దేరింది. బోరి అనే గ్రామంలో అజీం అనే వ్యక్తి బస్సు ఎక్కాడు. అజీం అప్పటికే మద్యం మత్తులో ఉన్నాడు. బస్సు ఎక్కగానే గొడవ పెట్టాడు. టికెట్ తీసుకున్న తర్వాత అందరిపై అరిచాడు. తనకు కూర్చోవడానికి సీటు కావాలని కండక్టర్‌ను గదమాయించాడు.
కానీ, బస్సు అప్పటికే రద్దీగా ఉన్నది. కూర్చోవడానికి సీట్లు లేవు. దీంతో సీట్లు లేవని, దయచేసి సహకరించాలని అజీంను కండక్టర్ సముదాయించారు. దీంతో తన డబ్బులు తనకు ఇచ్చేయాలని అజీమ్ ఫైర్ అయ్యాడు. దీంతో మరే దారి లేక టికెట్ డబ్బులు ఇచ్చేసి దింపేసినా.. అజీం అంతటితో ఊరుకోలేదు. బస్సు కొద్ది దూరం వెళ్లిన తర్వాత పరుగున వచ్చి మళ్లీ బస్సు ఎక్కాడు. మళ్లీ కండక్టర్ పై గొడవకు దిగాడు. దాడి చేశాడు. కండక్టర్ బుగ్గ కొరికాడు.
Also Read: Hijab: కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం.. హిజాబ్ బ్యాన్ నిర్ణయం వెనక్కి తీసుకుంటాం: సీఎం సిద్ధరామయ్య
దీంతో బస్సులోని తోటి ప్రయాణికులు అజీమ్‌ను మందలించారు. బస్సు నుంచి కిందికి దించేశారు. అయినా.. అజీమ్ వదిలిపెట్టలేదు. తన వాహనంలోకి బస్టాండ్‌కు వచ్చి మళ్లీ వీరంగం వేశాడు. దీంతో ఆర్టీసీ అధికారులు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.