Adilabad : బస్సులో సీటు కోసం ఎంతకు తెగించాడు...!
బస్సులో సీటు కోసం ఓ వ్యక్తి సైకోలా వ్యవహరిస్తూ కండక్టర్ చెంపను కొరికేసి తీవ్రంగా గాయపర్చాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఆదిలాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టిసి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్న విషయం తెలిసిందే. మహాలక్ష్మీ పథకం అమల్లోకి వచ్చినప్పటి నుండి ఆర్టిసి బస్సులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ఆడవాళ్ళతో నిండిపోయిన బస్సుల్లో మగవాళ్ళు, విద్యార్థులు అక్కడక్కడా ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల బస్సులో చోటులేక పైకెక్కి, ఫుట్ బోర్డ్ పై వేలాడుతూ ప్రయాణించే దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇలా ప్రయాణికులతో నిండుగా వున్న బస్సు ఎక్కిన ఓ వ్యక్తి సీటు దొరక్కపోవడంతో సైకోలా వ్యవహరించిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. సీటు కోసం కండక్టర్ తో వాగ్వాదానికి దిగిన సదరు ప్రయాణికుడు ఒక్కసారిగా మీదపడి చెంప కొరికేసి గాయపర్చాడు.
ఆదిలాబాద్ డిపోకు చెందిన ఆర్టిసి బస్సులో అజీంఖాన్ అనే ప్రయాణికుడు ఎక్కాడు. అప్పటికే ఆ బస్సు నిండుగా వుండటంతో అతడికి కూర్చోడానికి సీటు దొరకలేదు. ఈ పరిస్థితిలో ఎవరూ ఏం చేయలేరు... సర్దుకుపోయి ప్రయాణించాలి. కానీ అజీంఖాన్ అలాకాకుండా తనకు సీటు కావాలని... కూర్చుని మాత్రమే ప్రయాణిస్తానంటూ కండక్టర్ తో వాగ్వాదానికి దిగాడు. ఏమీ చేయలేని పరిస్థితిలో వున్న కండక్టర్ వెంటనే బస్సు ఆపి అజీంఖాన్ కిందకు దింపేసాడు.
అయితే తనను బస్సులోంచి అవమానకరంగా దించేసాడని కండక్టర్ పై అజీంఖాన్ కోపంతో రగిలిపోయాడు. వెంటనే మరో వాహనంలో బస్సును చేజ్ చేసి ఆపి మళ్ళీ కండక్టర్ తో గొడవకు దిగాడు. ఈసారి నేరుగా కండక్టర్ వద్దకు వెళ్లి ఒక్కసారిగా మీదపడిపోయి దాడికి దిగాడు. కండక్టర్ చెంపను గట్టిగా కొరికి రక్తం కారేలా గాయపర్చాడు. బస్సులోని మిగతావారు అజీంఖాన్ ను అడ్డుకున్నారు.
ప్రయాణికుడి దాడిలో తీవ్రంగా గాయపడ్డ బస్సు కండక్టర్ ఉన్నతాధికారుల సూచన మేరకు ఆదిలాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విధినిర్వహణలో వున్న ఆర్టిసి ఉద్యోగిపై దాడిచేసిన ప్రయాణికుడికి కఠినచర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.