టిఆర్ఎస్ ఎమ్మెల్యేపై తిరుగుబాటు (వీడియో)

party leaders stage revolt against TRS MLA in Nalgonda district
Highlights

  • మునుగోడు ఎమ్మెల్యేపై తిరుగుబాటు
  • వేనేపల్లి వెంకటేశ్వరరావు నాయకత్వం
  • కూసుకుంట్లకు వ్యతిరేకంగా ఏకమవుతున్న నేతలు
  • రెండు మండలాల భేటీకి వందల సంఖ్యలో కార్యకర్తల హాజరు

నల్లగొండ జిల్లా టిఆర్ఎస్ పార్టీలో ఊహించని పరిణామం జరిగింది. ఇంతకాలం జిల్లాలో టిఆర్ఎస్ రోజురోజుకూ బలోపేతమవుతోందన్న ప్రచారం ఒకవైపు సాగుతుంటే.. చాపకింద నీరులా ఉన్న అసమ్మతి భగ్గుమంటున్నది. తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై స్థానిక టిఆర్ఎస్ నేతలు తిరుగుబాటు చేశారు. ఆ పూర్తి వివరాలు కింద చదవండి. తిరుగుబాటుకు కారణాలను కింద ఉన్న వీడియోలో చూడండి.

నల్లగొండ జిల్లాలో ముందునుంచీ టిఆర్ఎస్ కు అంతగా బలం లేదు. టిఆర్ఎస్ ఏర్పాటైన నాటినుంచి 2014ఎన్నికల దాకా పెద్దగా ఈ జిల్లాలో పార్టీకి పట్టు లేదు. అయితే తెలంగాణ సెంటిమెంట్ తో పాటు కేసిఆర్ ప్రచారం కారణంగా జిల్లాలో ఎమ్మెల్యేలు భారీసంఖ్యలో గెలుపొందారు. ఉమ్మడి జిల్లాలో టిఆర్ఎస్ గాలి వీయడంతో సగం సీట్లలో ఆ పార్టీ గెలిచింది. మునుగోడు, సూర్యాపేట, ఆలేరు, తుంగతూర్తి, భువనగిరి, నకిరేకల్ స్థానాల్లో విజయం సాధించడంతోపాటు భువనగిరి పార్లమెంటు దక్కించుకుంది. కానీ.. తర్వాత కాలంలో జరిగిన ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా నల్లగొండ పార్లమెంటు సభ్యుడు టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతోపాటు మిర్యాలగూడ, దేవరకొండ ఎమ్మెల్యేలు కూడా టిఆర్ఎస్ కండవాలు కప్పుకున్నారు. ఇప్పుడు జిల్లాలో టిఆర్ఎస్ బలం 8 ఎమ్మెల్యేలు, 2 ఎంపిలకు చేరింది. అయితే ఇక రానున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ మరింత దూకుడుగా ముందుకు పోతుందన్న భావనలో అధిష్టానం ఉంది. స్థానికంగా పార్టీ బలోపేతమవుతోందని... పెద్ద సంఖ్యలో పార్టీలోకి వలసలు వస్తున్నాయని పార్టీ అంచనాల్లో ఉంది.

కానీ అనూహ్యంగా పార్టీలో తిరుగుబాట్లు మొదలైన పరిస్థితుల్లో కలవరం నెలకొంది. మనుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై స్థానిక టిఆర్ఎస్ నేతలు తిరుగుబాటు చేశారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పార్టీ నేతలు మీటింగ్ పెట్టుకున్నారు. మర్రిగూడ, నాంపల్లి మండలాల నేతలంతా ఇటీవల సమావేశమై ఎమ్మెల్యే తీరును ఎండగట్టారు. ఎమ్మెల్యే కార్యకర్తలను పట్టించుకోవడంలేదని, ఆయన వల్ల టిఆర్ఎస్ పార్టీ మునుగోడులో తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని భగ్గుమన్నారు. 60.. 70 మందితో చిన్న మీటింగ్ పెట్టుకుందామనుకుంటే ఎమ్మెల్యే వ్యతిరేకులంతా వందలసంఖ్యలో ఆ మీటింగ్ లో పాల్గొని ఎమ్మెల్యే పై నిప్పులు చెరిగారు. చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేని దుస్థితిలో టిఆర్ఎస్ నేతలు ఉన్నారని, ఎమ్మెల్యే వైఖరి కారణంగా జనాల్లో మొఖం చూపుకోలేకపోతున్నామని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కోసమే తాము టిడిపిని వీడి వచ్చామని అంటున్నారు. టిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే... ఎమ్మెల్యే కూసుకుంట్ల ఏనాడూ అందుబాటులో లేకపోవడంతో తమ గోడు పట్టించుకునే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు.

మనుగోడులో టిడిపి నాయకులంతా తెలంగాణ కోసం టిఆర్ఎస్ లో చేరారు. అందులో వేనేపల్లి వెంకటేశ్వరరావు కూడా తెలంగాణ కోసమే టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు ఈ తిరుగుబాటు కూడా వేనేపల్లి వెంకటేశ్వరరావు నాయకత్వంలోనే జరిగింది. నియోజకవర్గంలోని అసమ్మతి నాయకులంతా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేపై ఫైర్ అయ్యారు. వేనేపల్లి వెంకటేశ్వరరావు గతంలోనూ ఎమ్మెల్యే తీరును ఎండగట్టిన దాఖలాలున్నాయి. చర్లగూడెం రిజర్వాయర్ నిర్వాసితులకు న్యాయం చేయడంలో ఎమ్మెల్యే పట్టించుకోవడంలేదన్న ఆగ్రహంతో ఏకంగా ఇరిగేషన్ మంత్రి హరీష్ రావుకు బహిరంగ లేఖ రాశారు. వేనేపల్లి వెంకటేశ్వరరావు హరీష్ రావు అనుచరుడుగా చెబుతున్నారు. ఆయనది కూడా హరీష్ సామాజికవర్గమే. అయితే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విషయంలో తాము మూడున్నరేళ్లుగా ఉపేక్షించామని ఇక సహించేది లేదని తేల్చి చెప్పారు. ఇటీవల కాలంలో మర్రిగూడ, నాంపల్లి మండలాల ముఖ్య నేతల సమావేశం నిర్వహించి తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. నల్లగొండ జిల్లాలోనే కాక తెలంగాణ అంతటా ఈ పరిణామాలు హాట్ టాపిక్ అయ్యాయి.

తిరుగుబాటు నేత వేనేపల్లి వెంకటేశ్వరరావు సమావేశంలో మాట్లాడిన వీడియో కింద చూడొచ్చు.

loader