కేటిఆర్ కు పార్టీ ఫిరాయింపుల శాఖ బాగుంటది

party defection department is right portfolio for KTR says Nannuri Narsi reddy
Highlights

  • వెయ్యి మంది కేసిఆర్ లు వచ్చినా టిడిపి ని ఏం చేయలేేరు
  • పాలనపై దృష్టి పెట్టకుండా ఫిరాయింపులపై పెడతారా?
  • తెలుగుదేశం పార్టీ పొలిటికల్ యూనివర్శిటీ లాంటిది

తెలంగాణ రాష్ట్రంలో ఐటి, పరిశ్రమలు, పట్టాణాభివృద్ధి శాఖల మంత్రిగా కేటిఆర్ పనిచేస్తున్నారు. కానీ ఆయనకు ఆ శాఖల కంటే పార్టీ ఫిరాయింపుల శాఖ ఇస్తే మస్త్ ఉంటది అని సెలవిస్తున్నాడు టిడిపి తెలంగాణ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి. రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులపై పెట్టిన శ్రద్ధ ప్రజా సమస్యల పరిష్కారంలో పెట్టడంలేదని ఎద్దేవా చేశారు. వెయ్యి మంది కేసిఆర్ లు వచ్చినా టిడిపి ని దెబ్బతీయలేరని నన్నూరి హెచ్చరించారు.

బడుగు, బలహీనవర్గాల ఆశిస్సులతో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీని తెలంగాణలో ఏ శక్తీ ఏమీ చేయలేవని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ ఒక పొలిటికల్ యూనివర్శిటీ అన్న విషయాన్ని టిఆర్ఎస్ నేతలు గుర్తు పెట్టుకోవాలన్నారు. ఈ పార్టీని ఖాళీ చేయడం ఎవరి తరం కాదని హెచ్చరించారు. ఇప్పుడున్న తెలంగాణ ముఖ్యమంత్రి మొదలుకొని మంత్రులు, ఎమ్మెల్యేలంతా తెలుగుదేశం పార్టీ యూనివర్శిటీ నుంచి పుట్టిన వారే అని చెప్పారు.

టిడిపిలో అన్ని పదవులు అనుభవించిన కడియం శ్రీహరి లాంటి పెద్దమనుషులు నేడు టిడిపిపై అవాకులు, చెవాకులు పేలుతూ దొర కాళ్ల దగ్గర పెద్ద పాలేరుగా పనిచేస్తున్నారని నన్నూరి విమర్శించారు. కొంతమంది నేతలు స్వార్థం కోసం పార్టీ మారినంత మాత్రాన టిడిపికి వచ్చిన నష్టమేమీలేదన్నారు.

కొత్త తరం రాజకీయ నాయకత్వాన్ని తయారు చేసుకునే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉందని తెలిపారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అనేదే లేకపోతే రోజుకు పెద్ద సంఖ్యలో తీసుకొచ్చి కండువాలు కప్పే కార్యక్రమం ఎందుకు చేస్తున్నరని ప్రశ్నించారు. టిడిపిని దెబ్బతీయాలనుకున్నవారెవరూ కొసెల్ల లేదని హెచ్చరించారు.

loader