బండి సంజయ్ అరెస్ట్ ఇష్యూ: కరీంనగర్ సీపీకి పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అరెస్ట్ విషయమై వ్యవహరించిన తీరుపై పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ కరీంనగర్ సీపీ సత్యనారాయణకు నోటీసులు జారీ చేసింది. గతంలో కూడా సత్యనారాయణ ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కానున్నారు.
కరీంనగర్:బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ వ్యవహరంలో మరోసారి తమ ముందు హాజరు కావాలని పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ ఆదివారం నాడు కరీంనగర్ సీపీ సత్యనారాయణకు నోటీసులు పంపింది.
317 జీవోను నిరసిస్తూ BJPతెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjay జాగరణ దీక్షకు దిగారు. ఈ దీక్ష చేస్తున్న బండి సంజయ్ ను ఈ ఏడాది జనవరి 2వ తేదీ రాత్రి అరెస్ట్ చేశారు. కరోనా ప్రోటోకాల్ పాటించలేదని బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. బండి సంజయ్ సహా మరో నలుగురు నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఈ అరెస్ట్ అంశానికి సంబంధించి పోలీసులు వ్యవహరించిన తీరుపై బండి సంజయ్ పార్లమెంట్ లోక్‌సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో Privileges Committee ఈ విషయమై కరీంనగర్ సీపీ Satyanarayana, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, DGPలకు గతంలో నోటీసులు జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 3న ప్రివిలేజ్ కమిటీ ముందు Karmnagar CP సత్యనారాయణ హాజరయ్యారు.ఈ సమావేశానికి డీజీపీ, తెలంగాణ సీఎస్ మాత్రం హాజరు కాలేదు. అయితే మరోసారి ప్రివిలేజ్ కమిటీ ముందుకు రావాలని సీపీకి నోటీసులు అందాయి.
317 జీవో విషయమై రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ప్రభుత్వ ఉద్యోగులు నిరసనకు దిగారు. తమ స్థానికతను కోల్పోయే ప్రమాదం ఉందని ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు రాష్ట్రంలోని సుమారు 25 వేల మంది ఉపాధ్యాయులు తమ స్థానికతను కోల్పోయే అవకాశం ఉందని కూడా టీచర్ సంఘాలు ఆందోళన చేశాయి. ఈ ప్రచారాన్ని ప్రభుత్వం కొట్టిపారేసింది. స్థానికత విషయంలో కొన్ని సంఘాలు, విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అధికార TRS మండిపడింది.
ఈ అరెస్ట్ అంశం కంటే ముందు కూడా కరీంనగర్ సీపీ తీరుపై బండి సంజయ్ విమర్శలు చేశారు. తనపై సీపీ ఉద్దేశ్యపూర్వకంగా దాడి చేశారని కూడా బండి సంజయ్ మీడియా సమావేశం లో ఆరోపించారు. ఈ ఆరోపణలను సీపీ ఖండించారు.