స్వామి పరిపూర్ణానంద స్వామి అనూహ్యంగా సినీ క్రిటిక్ కత్తి మహేష్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. శ్రీరాముడిని తిట్టాడని.. నిన్నటిదాకా కత్తి మహేష్ పై మండిపడ్డ.. పరిపూర్ణానంద.. ఈ రోజు రామాయణాన్ని రచించిన వాల్మికితో కత్తి మహేష్ ని పోల్చడం గమనార్హం.

‘‘కత్తి మహేష్‌ను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నా. మహేష్‌ బోయవాడిగా మాట్లాడినా... వాల్మీకిగా మారగల శక్తి ఉన్నవాడు’’ అంటూ పరిపూర్ణానందస్వామి కొనియాడారు. భారతీయ సంస్కృతిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, విద్యా వ్యవస్థలో మార్పులు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. హిందూ సంప్రదాయం, విలువను తెలిపే విధంగా విద్యా వ్యవస్థ ఉండాలని, రామనామ విలువను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని పరిపూర్ణానంద పిలుపునిచ్చారు.
 
శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ కత్తి మహేష్‌పై హైదరాబాద్‌లో పలు కేసులు నమోదయ్యాయి. దీంతో నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని హైదరాబాద్ నుంచి కత్తి మహేష్‌ను బహిష్కరించిన విషయం తెలిసిందే. స్వయంగా తెలంగాణ డీజీపీ ప్రెస్‌మీట్ పెట్టి కత్తి మహేష్‌పై 6నెలల పాటు నగర బహిష్కరణ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇక శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామిపై కూడా హైదరాబాద్ పోలీసులు బహిష్కరణ వేటు వేశారు. గతంలో ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ.. వాటికి ఆయన సమాధానం చెప్పలేదంటూ పరిపూర్ణానందపై కూడా 6 నెలల బహిష్కరణ విధించారు.

ఒక్కసారిగా కత్తి మహేష్ పై పరి పూర్ణానంద తన అభిప్రాయాన్ని మార్చుకోవడం చాలా మందికి మింగుడు పడటం లేదు. పరిపూర్ణానందను బహిష్కరించడాన్ని వ్యతిరేకిస్తూ కత్తి పోస్టులు పెట్టడం వల్లనే ఆయన మనసు కరిగిందా అంటూ పలువురు విమర్శిస్తున్నారు.