జూలై నెలాఖరు కల్లా పంచాయతీ ఎన్నికలు పూర్తి కావాలి

జూలై నెలాఖరు కల్లా పంచాయతీ ఎన్నికలు పూర్తి కావాలి

జూలై నెలాఖరుకల్లా పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి అన్నారు. వచ్చే ఏడాది ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరపనున్నట్లు చెప్పారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ పెద్ద సవాల్ లాంటిదన్నారు. హోటల్ మారియట్ లో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి, డిజిపి మహేందర్ రెడ్డి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. 
సమావేశంలో నాగిరెడ్డి మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో 1.5 కోట్ల ఓటర్లు పాల్గొంటారని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఓటర్ల కంటే రెట్టింపు ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకుంటారని అన్నారు. బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నా 30 మంది చనిపోయారని అన్నారు. మన రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ చాలా సమర్థంగా ఉంటుందన్నారు. ఏడాది క్రితం నుంచే ఎన్నికల నిర్వహణ కసరత్తును ప్రారంభించామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జులై లోగా ఎన్నికలు పూర్తి చేయాల్సిందే అని అధికారులను ఆదేశించారు. ఈ రెండు నెలల్లో కొత్తగా ఎన్నికలు పూర్తి పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేలా పటిష్ట ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఎన్నకల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ శాఖ చర్యలు చేపట్టాలన్నారు. అవసరమైతే ఇతర రాష్ట్రాల నుంచి బలగాలను తీసుకోవాలని కోరారు. ఇప్పటికే ఓటర్ల తుది జాబితాలను సిద్ధం చేశామని, ముద్రణా సామాగ్రి అంతా జూన్ 15 కల్లా సిద్ధమవుతుందని తెలిపారు. కలెక్టర్లు రిటర్నింగ్ అధికారులను గుర్తించి నియమించాలని ఆదేశించారు. బ్యాలెట్ పత్రాల ముద్రణను జిల్లాల్లోనే చేపట్టాలన్నారు. సరిపడా బ్యాలెట్ బాక్సులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. సిబ్బంది నిర్వహణ మినహా మిగతా పనులను జూన్ పది లోగా పూర్తి చేసుకోవాలని ఆదేశించారు. కొత్త రాష్ట్రంలో సరికొత్త నాయకత్వాన్ని ప్రజలు స్వేచ్ఛగా ఎన్నుకునే అవకాశాన్నికల్పించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. భవిష్యత్ తెలంగాణకు పంచాయతీ ఎన్నికలు కీలక పునాది అవుతాయన్నారు. ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చెప్పారు. 
డిజిపి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ మిగతా ఎన్నికలతో పోలిస్తే చాలా తీవ్రమైన పోటీ ఉండే పంచాయతీ ఎన్నికలకు అవసరమైన ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. చాలా మంది ఎస్పీలు మొదటిసారి పంచాయతీ ఎన్నికలు నిర్వహించబోతున్నారని, జిల్లా పోలీసు అధికారులకు ఎన్నికల నిర్వహణపై సమగ్ర అవగాహన ఉండాలని సూచించారు. సమస్యలు ఎక్కడ వచ్చే అవకాశం ఉందో ముందే గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్, వరంగల్ కమీషనరేట్ల నుంచి కూడా పోలీస్ బలగాలను పంచాయతీ ఎన్నికల కోసం ఉపయోగిస్తాని వెల్లడించారు. 
ఎక్సైజ్, అటవీ తదితర శాఖల సహకారం కూడా తీసుకొంటామన్నారు. ఎలాంటి సంఘటనలకు ఆస్కారం జరిగేలా ఎన్నికలు జరిగేలా చూడాలని సూచించారు. ప్రతి ఎస్పీ, కమిషనర్ కూడా ఒక్క ఘటన జరగరాదన్న లక్ష్యంతో పనిచేయాలని ఆదేశించారు. ఎన్నికలు పూర్తయ్యాక కూడా ఎలాంటి ఘటనలు జరగకుండా చూడాలని పేర్కొన్నారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Telangana

Next page