భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో (Bhadradri-Kothagudem district) పాల్వంచలో (palvancha) రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసుకు సంబంధించి బాధితుడు రామృకృష్ణ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రికార్డు చేసిన మరో కీలక వీడియో వెలుగులోకి వచ్చింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో (Bhadradri-Kothagudem district) పాల్వంచలో (palvancha) రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి రామకృష్ణ సూసైడ్ నోట్, సెల్ఫీ వీడియో కీలకంగా మారిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సెల్ఫీ వీడియోలో రామకృష్ణ వ్యక్తం చేసిన ఆవేదన పలువురిని కలిచివేసింది. దీంతో పోలీసులు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్ర రావు (Vanama Raghavendra Rao) కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ మరింతగా పెరిగింది. ఈ క్రమంలోనే గత రాత్రి పోలీసులు రాఘవను అరెస్ట్ చేశారు. భద్రాద్రి జిల్లా సరిహద్దుల్లో మందలపల్లి అడ్డరోడ్డు వద్ద రాఘవను అదుపులోకి తీసుకున్నట్టుగా అదనపు ఎస్పీ కేఆర్‌కే ప్రసాద్ తెలిపారు. మరోవైపు రాఘవపై తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో టీఆర్‌ఎస్ పార్టీ అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
అయితే తాజాగా ఈ కేసుకు సంబంధించి బాధితుడు రామృకృష్ణ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రికార్డు చేసిన మరో కీలక వీడియో వెలుగులోకి వచ్చింది. అందులో రామకృష్ణ తాను మానసికంగా ఎంత ఒత్తిడి ఎదుర్కొన్నాననే విషయాన్ని వెల్లడించారు. తన బలవన్మరణానికి మొదటి సూత్రధారి వనమా రాఘవ అని ఆయన పేర్కొన్నాడు. మరో కారణం తన అక్క మాధవి అని చెప్పారు.
‘మీరు ఈ వీడియో చూసేటప్పటికీ నేను బతికి ఉంటానో.. లేదో తెలియదు. నా తండ్రి ద్వారా నాకు వచ్చే ఆస్తిలో నన్ను నమ్మి నాకు సహకరించిన మిత్రులకు నా థాంక్స్. నాకు అప్పుచ్చిన ప్రతి ఒక్కరికి.. నా వాటా నుంచి వచ్చే దాని నుంచి చెల్లించి.. నా తల్లికి, మా అక్కకి వదిలేయండి. నేను ఆత్మహత్య చేసుకోవడానికి మొదటి పాత్రధారి, సూత్రాధారి వనమా రాఘవేంద్రరావు. మా అక్క మాధవితో అతనికి 20 ఏళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. దీనికి మధ్యవర్తిగా మా అమ్మ సహకరించింది.
వీళ్లు ముగ్గురు కలిసి నా తండ్రి ద్వారా నాకు న్యాయబద్దంగా రావాల్సిన ఆస్తిని ఇవ్వకుండా అడ్డుపడ్డారు. సంవత్సర కాలం క్రితం పెద్ద మనుషుల ముందు కాగితాలు రాసుకుని వాటాలు తేల్చుకున్నాం. కానీ ఏడాది కాలంగా దానిని పెండింగ్‌లో పెట్టి.. అప్పులపాలు చేశారు. చివరకు చనిపోయే స్థితికి తీసుకొచ్చారు. వివాహేతర సంబంధం వల్ల కుటుంబం నాశనమయ్యే పరిస్థితికి తీసుకొచ్చారు. వీళ్లను ఏం చేస్తారే ఈ సమాజానికే వదిలిపెడుతున్నాను’ అని రామకృష్ణ వీడియోలో పేర్కొన్నారు.
రాఘవతో పాటు పోలీసులు.. అతడి ప్రధాన అనుచరుడు గిరీశ్, కారు డ్రైవర్‌ను కూడా అరెస్ట్ చేశారు. రాత్రి నుంచి రాఘవను పాల్వంచ సబ్ డివిజన్ కార్యాలయంలో పోలీసులు విచారిస్తున్నారు. రాఘవపై నమోదైన కేసులు, ఆరోపణలపై సుదీర్ఘంగా విచారణ చేపట్టారు. అంతేకాకుండా గతంలో రాఘవపై నమోదైన కేసులను వెలికితీస్తున్నారు.
