మునుగోడు స్రవంతిరెడ్డికి కోమటిరెడ్డి పొగ

First Published 1, Dec 2017, 1:09 PM IST
palvai Sravanthi Reddy peeved at Komatireddy rajagopals comments on Munugodu
Highlights

మునుగోడు నియోజకవర్గంలో పాగా వేసేందుకు కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రయత్నిస్తున్నారా? అక్కడ నాయకురాలిగా ఉన్న పాల్వాయి స్రవంతిరెడ్డికి పొగ పెడుతున్నారా? 2019 ఎన్నికల్లో మనుగోడు టికెట్ కోసం కోమటిరెడ్డి సోదరులు పావులు కదుపుతున్నారా? అంటే అవుననే అంటున్నాయి నల్లగొండ రాజకీయ వర్గాలు

మాజీ ఎంపి, ప్రస్తుత ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీకి పోటీ చేసే యోచనలో ఉన్నారు. ఆయన గతంలో భువనగిరి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసి గెలిచారు. తర్వాత అదే స్థానంలో 2014లో జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి బూర నర్సయ్య చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే తర్వాత కాలంలో జరిగిన లోకల్ బాడీ ప్రతినిధుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిని ఓడగొట్టి విజయం సాధించారు. ప్రస్తుతం  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్లమెంటుకు కాకుండా అసెంబ్లీకి పోటీ చేసే యోచనలో ఉన్నారు. ఉండడమే కాదు.. ఏకంగా మునుగోడు నియోజకవర్గంలో పోటీ చేసేందుకు సై అంటున్నారు. అందుకోసం పావులు కదుపుతున్నారు. అధిష్టానం ఆదేశిస్తే తాను మునుగోడులో పోటీకి సై అంటున్నారు.

అయితే గత కొంతకాలంగా మునుగోడులో దివంగత నేత పాల్వాయి గోవర్దన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతిరెడ్డి పనిచేస్తున్నారు. తన తండ్రి అనేక పర్యాయాలు ఇక్కడినుంచి ఎమ్మెల్యేగా పనిచేయడం, మంత్రిగా ఉండడంతో పాల్వాయి కుటుంబానికి మునుగోడులో మంచి సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో స్రవంతిరెడ్డి ఇక్కడినుంచి పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఆమె గత పదేళ్లుగా ఈ నియోజకవర్గంలో కార్యకర్తలతో, ప్రజలతో మమేకమై పనిచేస్తున్నారు. ఆమెను మునుగోడు నియోజకవర్గంలో బలోపేతం చేసేందుకు పాల్వాయి గోవర్దన్ రెడ్డి బతికి ఉన్న కాలంలో తీవ్రంగ ప్రయత్నం చేశారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేయాలని స్రవంతిరెడ్డి ప్రయత్నించారు. కానీ కాంగ్రెస్, సిపిఐ పొత్తులో భాగంగా ఆ సీటును సిపిఐ కి కట్టబెట్టారు. ఉజ్జిని యాదగిరి రావు అక్కడ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయగా స్రవంతిరెడ్డి రెబల్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. అంతిమంగా టిఆర్ఎస్ నుంచి పోటీ చేసిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు. ఈ పరిస్థితుల్లో రానున్న 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసేందుకు స్రవంతిరెడ్డి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పనితీరు పట్ల అధిష్టానం అంతగా పాజిటీవ్ గా లేదని తెలిసింది. సిఎం కేసిఆర్ చేయించిన సర్వేల్లో మునుగోడులో ప్రతికూల పవనాలు వీస్తున్నట్లు తేలిందని చెబుతున్నారు. సిట్టింగ్ లందరికీ సీట్లు ఇస్తామని కేసిఆర్ ప్రకటించిన నేపథ్యంలో మళ్లీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే సీటు వస్తుందా? లేక సర్వేల ఆధారంగా అభ్యర్థిని మారుస్తారా అన్న చర్చ టిఆర్ఎస్ లో జోరుగా సాగుతున్నది. ఈ పరిస్థితుల్లో ఇక్కడినుంచి పోటీ చేస్తే సునాయాసంగా విజయం సాధించొచ్చన్న ఉద్దేశంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. అంతేకాకుండా ఈ నియోజకవర్గం భువనగిరి పార్లమెంటుకు పరిధిలో ఉన్నది. అయినప్పటికీ కోమటిరెడ్డి సోదరులకు మనుగోడులో కూడా గట్టి ఫాలోయింగ్ ఉన్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. అందుకే ఈ స్థానంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఉద్దేశంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నట్లు చెబుతున్నారు. నల్లగొండలో వెంకట్ రెడ్డి, ఇక్కడ రాజగోపాల్ రెడ్డి పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి సోదరులకు, పాల్వాయి గోవర్దన్ రెడ్డిక మధ్య వైరం ఉంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉన్న రోజులున్నాయి. పాల్వాయికి అధిష్టానం అండదండలుండగా.. కోమటిరెడ్డి సోదరులకు దివంగత సిఎం వైఎస్ ఆశిస్సులు పుష్కలంగా ఉండేవి. దీంతో రెండు వర్గాల మధ్య ఎప్పుడూ వైరం ఉండేది. తుదకు అటు వైఎస్, ఇటు పాల్వాయి ఇద్దరూ మరణించినా ఈ వార్ ఇంకా కొనసాగుతూనే ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

బుధవారం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడెం, చండూరు మండలాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మీడియాతో మాట్లాడారు. తనకు అధిష్టానం మునుగోడు టికెట్ ఇస్తే లక్ష మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. స్రవంతిరెడ్డి తనకు సహకరిస్తే ఆమెకు ఎమ్మెల్సీ సీటు గ్యారెంటీగా ఇప్పిస్తానని హామీ ఇస్తున్నట్లు ప్రకటించారు. స్రవంతిరెడ్డి గ్రూపులను ఎంకరేజ్ చేసేవిధంగా ప్రతయ్నించడం సరికాదన్నారు. అయితే కోమటిరెడ్డి సోదరుల తీరు పట్ల స్రవంతిరెడ్డి తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలిసింది. బ్రదర్స్ మీద అధిష్టానానికి ఫిర్యాదు చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. మొత్తానికి కోమటిరెడ్డి బ్రదర్స్ చూపు పడడంతో మునుగోడు రాజకీయం రంజుగా మారింది.

loader