హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి కూడ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారు.  గురువారం నాడు ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో భేటీ అయ్యారు.

గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  పాలేరు నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా ఉపేందర్ రెడ్డి  పోటీ చేసి విజయం సాధించారు. ఉపేందర్ రెడ్డి చేతిలో  మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఓటమి పాలయ్యారు.

ఖమ్మం జిల్లాలో ఖమ్మం అసెంబ్లీ మినహా మిగిలిన అన్ని అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ ఓటమి పాలైంది. దీంతో  ఖమ్మంలో తన బలాన్ని పెంచుకొనేందుకు టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్‌ను చేపట్టింది. ఇందులో భాగంగానే  ఈ జిల్లా నుండి స్వతంత్ర అభ్యర్ధిగా విజయం సాధించిన వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ ఇప్పటికే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకొన్నారు.

మరో వైపు టీడీపీ నుండి గెలిచిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కూడ టీడీపీలో చేరుతానని ప్రకటించారు. ఇల్లెందు నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా విజయం సాధించిన హరిప్రియా నాయక్ కూడ టీఆర్ఎస్‌లో చేరుతానని ప్రకటించారు.

ఇదే జిల్లాకు చెందిన పాలేరు ఎమ్మెల్యే  ఉపేందర్ రెడ్డి కూడ కారులో షికారుకు సన్నద్దమయ్యారు. ఇప్పటికే ఆత్రం సక్కు, రేగా కాంతారావు, హరిప్రియానాయక్, చిరుమర్తి లింగయ్యలు టీఆర్ఎస్‌లో చేరుతామని ప్రకటించారు.

మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడ కాంగ్రెస్ పార్టీలో కొనసాగే అవకాశం లేదని తేలిపోయింది. కేసీఆర్‌తో ఇద్దరు కొడుకులతో కలిసి సబితా ఇంద్రారెడ్డి భేటీ కావడంతో  సబితా కుటుంబం టీఆర్ఎస్‌లో చేరికకు రంగం సిద్దం చేసుకొన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ నేతలకు కూడ స్పష్టత వచ్చినట్టుగా ఉంది. చేవేళ్లలో జరిగే టీఆర్ఎస్ సభలో సబితా ఇంద్రారెడ్డి కుటుంబం టీఆర్ఎస్‌లో చేరే అవకాశం ఉంది.

తాజాగా ఖమ్మం జిల్లాకు చెందిన పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరుతానని ప్రకటించడం గమనార్హం. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకొనేందుకుగాను టీఆర్ఎస్ వ్యూహత్మకంగా ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలపై ఆపరేషన్ ఆకర్ష్‌ను ప్రారంభించిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు కూడ చేరే అవకాశం ఉందని కేసీఆర్ టీఆర్ఎస్ శాసనసభపక్ష సమావేశంలో ప్రకటించిన  మూడు రోజులకే ఉపేందర్ రెడ్డి కేటీఆర్‌తో భేటీ కావడం విశేషం.