ఆసక్తికరంగా పాలకుర్తి పోరు, ఎర్రబెల్లిని ఢీకొడుతోన్న 26 ఏళ్ల యశస్విని .. జీతం మొత్తం ప్రజలకే ఇస్తానంటూ హామీ
ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంపై ప్రస్తుతం అందరి చూపు పడింది. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా పనిచేసిన 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఎర్రబెల్లి దయాకర్ రావుపై అత్యంత పిన్న వయస్కురాలైన 26 ఏళ్ల యశస్విని రెడ్డి పోటీ చేస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హేమాహేమీలు తలపడుతుండగా.. తొలిసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న వారు కూడా వున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంపై ప్రస్తుతం అందరి చూపు పడింది. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా పనిచేసిన 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఎర్రబెల్లి దయాకర్ రావుపై అత్యంత పిన్న వయస్కురాలైన 26 ఏళ్ల యశస్విని రెడ్డి పోటీ చేస్తున్నారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైతే.. తనకు వచ్చే వేతనాన్ని ప్రజలకు విరాళంగా ఇస్తానని యశస్విని చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది.
బీటెక్ గ్రాడ్యుయేట్ అయిన యశస్విని రెడ్డి స్థానంలో నిజానికి ఆమె అత్త ఝూన్సీ రాజేందర్ రెడ్డి పోటీ చేయాల్సి వుంది. అయితే ఆమెకు భారత పౌరసత్వానికి సంబంధించిన అడ్డంకులు ఎదురుకావడంతో యశస్విని బరిలో దిగింది. పాలకుర్తి ప్రజలకు సేవ చేయాలనే తన కుటుంబ ఆశయాన్ని తాను ముందుకు తీసుకెళ్తానని ఆమె చెప్పింది. పాలకుర్తిలో అభివృద్ధి లేమి, ఇతర సమస్యలను ప్రస్తావిస్తూ.. ఇక్కడ మార్పు ఆవశ్యకతను యశస్విని వెల్లడించారు. దయాకర్ రావు వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా వున్నప్పటికీ.. నియోజకవర్గం జనగామ, వరంగల్ వంటి ఇతర ప్రాంతాల కంటే వెనుకబడి వుందన్నారు. ప్రజలను దయాకర్ రావు విస్మరించారని యశస్విని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాలకుర్తిలో విద్యాసంస్థల కొరతను ఎత్తిచూపిన ఆమె.. దయాకర్ రావు మంత్రిగా వున్నప్పటికీ జూనియర్, డిగ్రీ కళాశాలలు లేవని చురకలంటించారు. విద్యా సౌకర్యాల స్థాపన కోసం పోరాడుతానని , పాలకుర్తి ప్రజలతో మమేకమవుతానని యశస్విని హామీ ఇచ్చారు. సమాజ సేవలో ఆమె కుటుంబం గత చరిత్ర, ప్రస్తుతం కాంగ్రెస్ గాలి బాగా వీస్తూ వుండటం, ఉన్నత విద్యావంతురాలు కావడం, ఎర్రబెల్లిపై వ్యతిరేకతతో యశస్వినికి పాలకుర్తిలో సానుకూల వాతావరణం కనిపిస్తోంది.