Asianet News TeluguAsianet News Telugu

చేనేతపై జీరో జీఎస్టీ కోసం పోచంపల్లిలో సమర శంఖం.. రేపు లక్ష ఉత్తరాల కార్యక్రమానికి శ్రీకారం

చేనేతపై సున్నా జీఎస్టీ అమలు చేయాలని పద్మశాలి సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ డిమాండ్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ల ముందుకు తీసుకెళ్లాలని తెలిపింది. ఇందుకోసం లక్ష మంది వీరిద్దరికీ లేఖలు రాయాలని పిలుపు ఇచ్చింది. ఈ కార్యక్రమానికి రేపు ఉదయం పోచంపల్లిలో శ్రీకారం చుట్టనుంది. లేఖలు రాసే విధానాన్ని ఓ ప్రకటనలో పద్మశాలి సంఘం వెల్లడించింది.
 

padmashali union called to write letters to pm demanding zero gst on handlooms
Author
Hyderabad, First Published Jan 27, 2022, 1:42 PM IST

హైదరాబాద్: పోచంపల్లి (Pochampally)లో జీరో జీఎస్టీ (Zero GST) కోసం అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత(Handloom) విభాగం ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నది. జీరో జీఎస్టీ అమలు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి లక్ష ఉత్తరాలు పంపాలని నిర్ణయించింది. రేపు ఉదయం అంటే జనవరి 28వ తేదీన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు కొండా లక్షణ్ బాపూజీ విగ్రహానికి నివాళి అర్పించిన తర్వాత చేనేతపై జీరో జీఎస్టీ అమలు చేయాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌లకు ఉత్తరాలు (Letters) పంపే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఎమ్మెల్సీ ఎల్ రమణ, స్థానిక శాసన సభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి, పద్మశాలి సంఘ అగ్ర నేతలు, చేనేత నేతలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. కాబట్టి,  ఈ కార్యక్రమంలో ఎక్కువ మంది పాల్గొని జయప్రదం చేయాలని పద్మశాలి సంఘం ఓ ప్రకటనలో పిలుపు ఇచ్చింది.

ఇదే ప్రకటనలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌లకు ఏ విధంగా లేఖలు రాయాలా? అనే వివరాలనూ పేర్కొంది. ఆంగ్లంలో ఉత్తరాలు రాసి చివరలో సంతకం పెట్టాలని, దాని కిందే పేరు, జిల్లా, రాష్ట్రం పేరు రాయాలని కోరింది. భారత స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తిని గౌరవిస్తూ.. చేనేతపై జీరో జీఎస్టీ విధించాలని కోరుతూ లేఖ రాయాలని వివరించింది. అంతేకాదు, చేనేత భారత వారసత్వం అని, దయచేసి దాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేయాలని తెలిపింది. ప్రధానమంత్రి చిరునామాగా.. న్యూఢిల్లీలోని రైసినా హిల్, సౌత్ బ్లాక్‌కు లేఖ రాయాలని పేర్కొంది.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కూ ఇదే విధంగా లేఖ రాయాలని పద్మశాలి సంఘం ఆ ప్రకటనలో వివరించింది. చిరునామా విభాగంలో నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ మంత్రి అని రాయాలని తెలిపింది. న్యూ ఢిల్లీలోని సఫ్దార్‌జంగ్ రోడ్డు, 15, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు లేఖ రాయాలని సూచించింది.

కాగా, జనవరి 31 నుంచి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గత ఏడాది పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సమయంలో అనుసరించిన ప్రోటోకాల్‌ల మాదిరిగానే అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. సెప్టెంబరు 2020లో జరిగిన పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల  నేప‌థ్యంలో తొలిసారిగా పార్లమెంటరీ కార్యకలాపాలు కఠినమైన కోవిడ్-19 ప్రోటోకాల్ చ‌ర్య‌లు తీసుకున్నారు. రోజు ప్రథమార్థంలో రాజ్యసభ, ద్వితీయార్థంలో లోక్‌సభ సమావేశమయ్యాయి. సామాజిక దూరాన్ని పాటిస్తూ.. సభ్యులు రెండు ఛాంబర్లలో కూర్చున్నారు. 

బ‌డ్జెట్ పై కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ సారి కూడా 'గ్రీన్ బ‌డ్జెట్‌' ను తీసుకోవ‌డానికి  సిద్ద‌మైంది. అంటే ఇంత‌కు ముందు బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన మాదిరిగానే ఈ సారి కూడా డిజిటల్ బడ్జెట్ నే ప్రవేశపెట్టనుంది. పరిమిత సంఖ్యలో మాత్రమే బడ్జెట్ ఫిజిక‌ల్ కాపీలను (Budget documents) ముద్రించనున్నారు. బడ్జెట్ పత్రాలు చాలా వరకు డిజిటల్‌గా అందుబాటులో ఉంటాయని సంబంధిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి. గతంలో పార్లమెంట్‌ సభ్యులకు, జర్నలిస్టులకు అందించడానికి వందలాది బడ్జెట్‌ ప్రతులను ముద్రించాల్సి వచ్చేది. ఈ ముద్రణ కోసం పార్లమెంట్‌ నార్త్‌ బ్లాక్‌లోని ప్రింటింగ్‌ సిబ్బంది దాదాపు రెండుమూడు వారాల పాటు అక్క‌డే ఉండాల్సి ఉండేది.

Follow Us:
Download App:
  • android
  • ios