తెలంగాణలో పండిన ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనని మంత్రి జగదీశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. అది కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని, ఆహార భద్రత చట్టం కూడా అదే చెబుతున్నదని తెలిపారు. కానీ, దాని బాధ్యతల నుంచి తప్పించుకోవాలని మోడీ ప్రభుత్వం చూస్తే.. దాని మెడలు వంచి అయినా కొనిపిస్తామని అన్నారు. 

హైదరాబాద్: పండిన ప్రతి గింజను కొనాల్సిన బాధ్యత కేంద్రానిదేనని, ఆహార భద్రత చట్టం కూడా ఇదే చెబుతున్నదని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ పట్ల కేంద్రం పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నదని ఆరోపించారు. రాజకీయ క్రీడలతో రైతాంగం నోట్లో మట్టికొట్టవద్దని అన్నారు. దాగుడు మూతలతో రైతులను దగా చేయవద్దని చెప్పారు. కానీ, తాము రైతాంగం తరఫున రాజీ లేని పోరాటం చేస్తామని వివరించారు. కేంద్రం ఎన్ని నాటకాలు చేస్తున్నా దాని మెడలు వంచి అయినా తెలంగాణలో పండిన ధాన్యాన్ని కొనిపించి తీరుతామని అన్నారు.

సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన నిరసన ప్రదర్శనలో కేంద్ర మంత్రి జగదీశ్ రెడ్డి పాల్గొన్నారు. ఇక్కడ మాట్లాడుతూ, పండిన పంటను కొనుగోలు చేయాల్సిన బాధ్యత ముమ్మాటికి కేంద్రానిదేనని, ఆ బాధ్యతల నుంచి మోడీ ప్రభుత్వం తప్పుకోవాలని చూస్తే మెడలు వంచి మరీ వారితో పంటను కొనుగోలు చేయిస్తామని వార్నింగ్ ఇచ్చారు. మన రాష్ట్రంలో పండిన పంటను కేంద్రం కొనుగోలు చేసేంత వరకు నిరసనలు జరుగుతాయని, ఈ నిరసనలు మరో ఉద్యమానికి అంకురార్పణ చుట్టబోతున్నదని అన్నారు. రాజకీయ క్రీడలతో రైతాంగం నోట్లో మట్టి కొట్టవద్దని కోరారు. నిజానికి యాసంగిలో వరి వద్దని సీఎం కేసీఆర్ వారించారని, కానీ, బీజేపీ నేతలే అతి చేస్తూ వరి వేయాలని రైతులను ఉసిగొల్పారని చెప్పారు.

ఆహార భద్రతా చట్టం కూడా కేంద్ర ప్రభుత్వమే పండిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని చెబుతున్నదని ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి గుర్తు చేశారు. గత నాలుగు దశాబ్దాలుగా అదే అమలు అవుతున్నదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇదే పద్ధతి కొనసాగిందని వివరించారు. ఇప్పుడు అందుకు భిన్నంగా రైతుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా కేంద్రం కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. కేసీఆర్ ఇచ్చిన ధైర్యం, అండతో రైతాంగం ఇప్పుడిప్పుడే అప్పు ఊబి నుంచి బయటపడుతున్నదని అన్నారు. కానీ, బాధ్యతారాహిత్యంగా కేంద్రం అనుసరిస్తున్న విధానాలతో రైతులు మళ్లీ గందరగోళంలో పడుతున్నారని ఆవేదన చెందారు.

బీజేపీ ప్రభుత్వం ధాన్య కొనుగోలు విషయంలో డ్రామాలకు ఫుల్‌స్టాప్ పెట్టాలని మంత్రి అన్నారు. అంతేకాదు, పంట కొనుగోలుపై జాతీయ విధానం ప్రకటించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఏయే రాష్ట్రాల్లో ఏ పంట పండించాలో.. పండించిన పంటలో ఎంత మేరకు కొనుగోలు చేయాలో వంటి అంశాలతో కేంద్రం ఆ ప్రణాళికల ద్వారా ముందే తెలియపరచాలని అన్నారు. తద్వారా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ప్రణాళికలకు అనుగుణంగా రైతాంగంలో అవగాహనను పెంపొందిస్తాయని వివరించారు.

అలాకాకుడా.. దాగుడు మూతలతో రైతాంగాన్ని దగా చేయాలని ప్రయత్నిస్తే టీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.

పండిన పంటను కేంద్రం కొనుగోలు చేయకుంటే.. పర్యటనకు వస్తున్న బీజేపీ నేత బండి సంజయ్ నెత్తిన పోసేందుకు రైతాంగం రెడీగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. రైతాంగ ప్రయోజనాల కోసం తమ పార్టీ తుది కంటా పోరాటం చేస్తుందని అన్నారు. టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పిలుపు మేరకు ప్రతి మండల కేంద్రంలో పార్టీ శ్రేణులు నిరసనలు చేస్తున్నాయి.