హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. కోమటిరెడ్డి సోదరుల వద్ద డబ్బు లేకపోవడం వల్లే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయారని చెప్పుకొచ్చారు. 

డబ్బు ఉంటే గెలిచేవారని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకి అనుకూలంగానే వస్తాయని అందులో గొప్పతనం ఏముందన్నారు. ఇకపోతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలు పోటాపోటీగా ఉంటాయని వ్యాఖ్యానించారు. 

శాసనమండలిలో 35 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఉన్నా కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఒక్కరున్నా సమానమేనంటూ చెపుకొచ్చారు. మరోవైపు హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఉత్తమ్ కుటుంబానికి చెందిన వారైతేనే గెలుపు సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ పార్లమెంట్ నుంచి ఎంపీగా గెలుపొందారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగనుంది.