Asianet News TeluguAsianet News Telugu

కేసిఆర్ సర్కారుకు ఓయు స్టూడెంట్స్ భారీ షాక్

  • 105 వ సైన్స్ కాంగ్రెస్ సదస్సు వాయిదా
  • ఉస్మానియాలో జరపలేమని చేతులెత్తేసిన విసి
  • వందేళ్ల ఉస్మానియా ఉత్సవాల్లో సర్కారుపై స్టూడెంట్స్ ఆగ్రహం
  • వందేళ్ల సైన్స్ కాంగ్రెస్ చరిత్రలో ఇది తొలి అనుభవం
OU campus unrest forces government to back out from organizing Science Congress

పోరాటాల గడ్డ ఉస్మానియా యూనివర్శిటీ మరోసారి పాలకులకు గట్టి షాక్ ఇచ్చింది. నాడు తెలంగాణ ఉద్యమంలో సీమాంధ్ర పాలకులకు ముచ్చెమటలు పట్టించిన ఉస్మానియా యూనివర్శిటీ నేడు తెలంగాణ పాలకులకు సైతం అందే రీతిలో చుక్కలు చూపిస్తున్నది. తాజాగా ఉస్మానియా విద్యార్థులు తెలంగాణ సర్కారుకు భారీ షాక్ ఇచ్చారు. ఆ వివరాలు కింద చదవండి.

తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పటి వరకు కోర్టుల నుంచి సర్కారుకు షాక్ తగిలే పరిస్థితులు ఉండేవి. కానీ ఈసారి కోర్టు షాక్ కాదు.. సైన్స్ కాంగ్రెస్ రూపంలో ఉస్మానియా విద్యార్థులు ఇచ్చారు. వందేళ్ల సైన్స్ కాంగ్రెస్ చరిత్రలో తొలిసారి ఈ తరహా షాక్ ను కేవలం తెలంగాణ సర్కారుకే తగిలిందంటే కారణం ఉస్మానియా విద్యార్థుల ఆక్రందనలే కారణంగా చెప్పవచ్చు.

హైదరాబాద్ లోని ఉస్మానియాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సు అనూహ్యంగా వాయిదా పడింది. ఉస్మానియా యూనివర్శిటీలో ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేపట్టేందుకు సర్కారు ఎప్పటినుంచో ఏర్పాట్లలో మునిగిపోయింది. ఈ సదస్సుకు దేశం నలుమూలల నుంచి ప్రపంచ వ్యాప్తంగా సుమారు 20 వేల మంది సైంటిస్టులు వస్తారని, వారందరికీ మంచి భోజనం అద్భుతమైన వసతి ఉండేలా చర్యలు తీసుకోవాలని సర్కారు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లలో మునిగిపోయింది. ఉస్మానియా విద్యార్థులకు నెలరోజులపాటు సెలవులు ఇచ్చి బయటకు పంపేందుకు కసరత్తు కూడా చేసింది. కొందరు విద్యార్థులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నా కూడా బలవంతంగా గెంటేస్తామని హెచ్చరించింది. అయితే ఈ సదస్సు వాయిదా వేస్తున్నట్లు సైన్స్ కాంగ్రెస్ ప్రకటించడం హాట్ టాపిక్ అయింది. ఉస్మానియాలో జనవరి 3 నుంచి 7వ తేదీ వరకు జరగనున్న సదస్సును వాయిదా వేస్తున్నట్లు సైన్స్ కాంగ్రెస్ తన వెబ్ సైట్ లో సమాచారం పోస్టు చేసింది.

యూనివర్శిటీలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలోనే సదస్సు వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది. యూనివర్శిటీలో తెలంగాణ సర్కారుపై విద్యార్థులు రగిలిపోతున్నారని, ఈ పరిస్థితుల్లో సదస్సు జరిగితే అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే ప్రమాదం ఉందని సర్కారు భావించింది. అందుకే ఓయూ వైస్ ఛాన్సెలర్ చేత ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడ సదస్సును నిర్వహించడం కష్టమని నివేదిక ఇప్పించిచారని తెలిపింది. ప్రధాని మోదీ కూడా ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో, శాంతి భద్రతలకు సంబంధించిన ఇంటెలిజెన్స్ రిపోర్టు సైన్స్ కాంగ్రెస్ వర్గాలను కలవరపాటుకు గురిచేసింది. దీంతో  సదస్సును వాయిదా వేశారు. 11 ఏళ్ల తర్వాత సైన్స్ కాంగ్రెస్ హైదాబాద్ లో జరగాల్సి ఉంది. గత వందేళ్లలో సైన్స్ కాంగ్రెస్ వాయిదా పడటం ఇదే తొలిసారి. గత ఏడాది ఈ సదస్సు ఏపీలోని ఎస్వీ యూనివర్శిటీలో నిర్వహించారు.

 ఇటీవలే మురళి అనే విద్యార్థి ఓయూలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో, అక్కడ భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చోటు చేసుకున్నాయి. మరోవైపు, నాన్ టీచింగ్ స్టాఫ్ నిరవధిక దీక్షలు చేస్తున్నారు. ఇంకొకవైపు లంబాడాలు-ఆదివాసీల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఉద్యోగ నోటిపికేషన్ల కోసం యువత పెద్ద ఎత్తున ఉస్మానియా కేంద్రంగా ఆందోళనలు చేస్తున్నారు. మరోవైపు ఎమ్మార్పీఎస్ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపడుతోంది. వీటికి సంబంధించిన విద్యార్థులు యూనివర్శిటీలో ఏ క్షణంలోనైనా ఆందోళన చేసే ప్రమాదముందని గుర్తించి వాయిదా నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణలో ఉద్యోగాల జాతర సాగి తామందిరికీ కొలువులొస్తాయని ఎదురుచూసిన నిరుద్యోగుల ఆశలు అడియాశలయ్యాయి. దీంతో నిరుద్యోగులు గత మూడేళ్లుగా ఆందోళనలు చేస్తున్నారు. ముఖ్యంగా ఉస్మానియాలో పోరాటాలు తీవ్రంగా ఉన్నాయి. గతంలో జరిగిన వందేళ్ల ఉస్మానియా వేడుకల్లో విద్యార్థులు ఆగ్రహావేశాలు ఎంతగా ఉన్నాయో సర్కారు స్వయంగా చవిచూసింది. దీంతో ఆ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసిఆర్ మాట్లాడకుండానే వెనుదిరిగిన పరిస్థితి ఉంది. విద్యార్థుల వ్యతిరేకత కారణంగానే కేసిఆర్ మాట్లాడకుండా ఉస్మానియా నుంచి వెనుదిరిగినట్లు చెబుతున్నారు.  అప్పట్లో నిరుద్యోగుల్లో ఇంత ఆగ్రహం లేదు. కొందరికి సర్కారు జాబ్ నోటిఫికేషన్లు ఇస్తుందేమోనన్న ఆశ ఉంది. అందుకే ఆ సమయంలో విద్యార్థుల ఆందోళనను సర్కారు కంట్రోల్ చేయగలిగింది. కానీ ఇప్పుడు విద్యార్థులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కాబట్టి మరింత ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుందన్న భయంతోనే విసి చేతులెత్తేశారని తెలుస్తోంది. ఒకవేళ సదస్సు జరిగి తీరా విద్యార్థులు ఆందోళన చేస్తే... ప్రపంచం ముందు తెలంగాణ సర్కారు అవమానాలపాలవుతుందన్న అంచనాతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

మొత్తానికి ప్రపంచ తెలుగు మహాసభలు, ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సును విజయవతంగా చేపట్టి కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్న తెలంగాణ సర్కారుకు సైన్స్ కాంగ్రెస్ జరపలేకపోయారన్న అపవాదు మూటకట్టుకుంది. సైన్స్ కాంగ్రెస్ జరిగే వేళ ఏదైనా గొడవలు జరిగితే తెలంగాణ యూనివర్శిటీల్లో ఉన్న అశాంతి భారతదేశానికే కాకుండా సరిహద్దులు దాటే ప్రమాదం ఉందన్న కారణంగా వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

27న తుది నిర్ణయం : ఉస్మానియా విసి 

సైన్స్ కాంగ్రెస్ నిర్వహణ విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఈనెల 27న కమిటీ సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటుందని ఉస్మానియా విసి ప్రొఫెసర్ రామచంద్రుడు మీడియాకు చెప్పారు. సైన్స్ కాంగ్రెస్ నిర్వహణ విషయంలో వెనుకడుగు వేయడంలో అనేక కారణాలున్నాయని ఆయన వెల్లడించారు. 27న అధికారిక నిర్ణయాన్ని వెలువరిస్తామన్నారు.

 

 

ముమ్మాటికీ కేసిఆర్ సర్కారు వైఫల్యమే : ఓయు జెఎసి బాల లక్ష్మి

నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ తెచ్చుకుంటే సర్కారు మాత్రం నియామకాల గురించి పట్టించుకోవడంలేదు. ఉద్యోగాల గురించి ఉస్మానియా విద్యార్థులు గట్టిగా సర్కారును నిలదీస్తున్నారు. వందేళ్ల ఉస్మానియా ఉత్సవాల్లో తెలంగాణ సర్కారుకు విద్యార్థి శక్తి ఎట్లుంటదో తెలిసింది. ఇప్పుడు మల్లా స్టూడెంట్స్ ఆందోళన చేస్తే పరువు పోతుందన్న భయంతోనే సర్కారు చేతులెత్తేసింది. మూడేళ్లుగా ఓయులో పోలీసు నిర్బంధాలు కొనసాగుతున్నాయి. శ్రీకాంతచారి చనిపోయిన రోజే ఉస్మానియా స్టూడెంట్ మురళి కూడా చనిపోయాడు. విద్యార్థి చనిపోయినందున ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేసినం. పోలీసులు ఓవర్ యాక్షన్ చేసి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొల్పారు. సీనియర్ నాయకులందరినీ అరెస్టు చేశారు. మీడియాను గుప్పిట పెట్టుకుని.. పోలీసుల మద్దతుతో పాలన చేసినంత ఈజీగా ఉస్మానియాలో సైన్స్ కాంగ్రెస్ జరపలేరని సర్కారు గుర్తించింది. ముందుగా విద్యార్థులందరికీ సెలవులిచ్చి సదస్సు జరపాలనుకున్నారు కానీ వ్యతిరేకత వచ్చింది. ఎటు చూసినా బదనాం అయ్యే ప్రమాదముందని సర్కారు చేతులెత్తేసింది. ఇది ముమ్మాటికీ సర్కారు వైఫల్యమే.

Follow Us:
Download App:
  • android
  • ios