ఉస్మానియాకు న్యాక్ గుర్తింపు ఏ ప్లస్ సాధించిన ఉస్మానియా సర్కారు సహకారం అరకొరే అయినా సత్తా చాటిన ఉస్మానియా

ఉస్మానియా యూనివర్శిటీ గెలిచింది. నిలిచింది. చరిత్రలో తనుకున్న గొప్పతనాన్ని నిలబెట్టుకుంది. వందేళ్ల విద్యా కుసుమం తన ప్రతిష్టను కాపాడుకుంది. సర్కారు కత్తి గట్టినా, ఉద్యోగ ఖాళీలు వెక్కిరిస్తున్నా, విద్యార్థులకు ఫీజులు, స్కాలర్ షిప్స్ అందించకపోయినా తన ప్రాభవాన్ని నిలుపుకుని సత్తా చాటింది. న్యాక్ గుర్తింపు సాధించి పరువు నిలబెట్టుకుంది.

నాలుగేళ్ల కాలానికి ఉస్మానియా న్యాక్ ఏ ప్లస్ కేటగిరీ సాధించింది. (ఏ ప్లస్ ప్లస్ తర్వాత ఎ ప్లస్ అంటే కేటగిరీలో ఉస్మానియా నిలిచింది). 2008లో ఉస్మానియా ఏ ర్యాంకు సాధించింది. అయితే ఆ తర్వాత 2013లో ఆ ర్యాంకు కోల్పోయింది. తిరిగి తాజాగా 2017లో ఏ ప్లస్ సాధించింది. అదే సమయంలో కాకతీయ, జెఎన్ టియు హెచ్ ఏ ర్యాంకు సాధించాయి.

తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఉస్మానియా యూనివర్శిటీకి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య తీవ్రమైన అగాథం ఏర్పడింది. ఉస్మానియా భూములు డబుల్ బెడ్రూముల ఇండ్లకు వాడుకుంటామంటూ సిఎం కేసిఆర్ చేసిన ప్రకటనతో ఉస్మానియా అగ్గి మీద గుగ్గిలమైంది. అప్పటి నుంచి ఉస్మానియా పట్ల సర్కారు ఎడం ఎడంగానే ఉంది.

ఉస్మానియాలో 50 శాతం టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా వాటిని మూడేళ్లుగా సర్కారు నింపలేదు. విద్యార్థులకు స్కాలర్ షిప్స్, ఫీజు రీయంబర్స్ మెంట్ పంపిణీ సక్రమంగా జరగలేదు. విద్యార్థుల మెస్ ఛార్జీలు చెల్లించలేదు. అరకొర సౌకర్యాల మధ్య ఉస్మానియా విద్యార్థులు, సిబ్బంది సమష్టి కృషితో న్యాక్ ర్యాంకింగ్స్ లో ఏ ప్లస్ గుర్తింపు దక్కించుకుంది.

కేసిఆర్ సర్కారు చేసిందేమీలేదు : ఓయు జెఎసి

గొప్ప చరిత్ర ఉన్న ఉస్మానియాకు తెలంగాణ వచ్చిన తర్వాత మరింత గొప్పగా ఉంటుందని ఊహించినా కేసిఆర్ సర్కారు ఉస్మానియాకు చేసిందేమీ లేదని ఓయు జెఎసి అధికార ప్రతినిధి బాలలక్ష్మి ఏషియా నెట్ తో చెప్పారు. సిబ్బంది నియామకం చేయలేదని, మెస్ బిల్లులు కూడా సకాలంలో ఇవ్వలేదని ఆమె ఆరోపించారు. అయినప్పటికీ ఉస్మానియా సిబ్బంది, విద్యార్థులు గట్టి ప్రయత్నం చేసి న్యాక్ గుర్తింపు తెచ్చుకున్నారని, ఉస్మానియా పరువు కాపాడారని తెలిపారు. విద్యార్థులు ఉద్యమాల్లో ముందున్నప్పటికీ చదువులోనూ సత్తా చాటారని ఆమె హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం మూడేళ్లు ఉస్మానియాను ఎండబెట్టి కేవలం సంబరాలకు మాత్రమే నిధులిచ్చింది తప్ప న్యాక్ గుర్తింపు కోసం సర్కారు చేసింది ఏమాత్రం లేదని ఆమె పేర్కొన్నారు. 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి