సంగారెడ్డి: తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో శుక్రవారం పెను ప్రమాదం తప్పింది. నడిరోడ్డుపై ఒక్కసారిగా ఆరెంజ్ ట్రైవెల్ బస్సు మంటల్లో చిక్కుకుంది. బస్సులో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్రమైన భయాందోళనలకు గురయ్యారు. 

ముంబై నుంచి హైదరాబాదు వస్తున్న ఆరెంజ్ ట్రావెల్స్  బస్సు సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం సమీపంలోకి రాగానే ప్రమాదం సంభవించింది. బస్సు ముందు భాగంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. 

అప్రమత్తమైన డ్రైవర్ బస్సును ఆపేసి ప్రయాణికులను దించేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు దిగిన వెంటనే క్షణాల్లో బస్సు పూర్తిగా కాలిపోయింది. 

బస్సులో ఉన్న ప్రయాణికుల సామగ్రి మొత్తం మంటల్లో దగ్ధమైంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 28 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు ఇంజన్ లోంచి మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.