హైదరాబాద్: అఖిలపక్షం ఇంటర్‌ బోర్డు ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పలువురు నేతలను పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. కాంగ్రెస్‌, బీజేపీ, సీపీఐ, టీజేఎస్‌ నేతలను అరెస్టు చేశారు. పలువురికి గృహ నిర్బంధం విధించారు. కాంగ్రెస్‌ నేత అంజన్‌కుమార్‌ యాదవ్‌ హౌస్‌ అరెస్టు చేశారు. 

టీజేఎస్ అధినేత కోదండరాంను హౌస్ అరెస్టు చేసి, ఇంటి దగ్గర పోలీసులు మోహరించారు. ఇంటర్‌ బోర్డు కార్యాలయం దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. ఇంటర్‌ ఫలితాల్లో తప్పిదాలు, విద్యార్థుల ఆత్మహత్యలను నిరసిస్తూ అఖిలపక్షం నేతృత్వంలో సోమవారం ఇంటర్‌ బోర్డు కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అరెస్టు చేసి ఆయనను జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇంటర్ ఫలితాలపై అధికార పార్టీ నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని షబ్బీర్ అలీ ఈ సందర్భంగా అన్నారు. చనిపోయిన 23మంది విద్యార్థుల ప్రాణాలు తిరిగి తెస్తారా అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ నేత కేటీఆర్ ట్విట్టర్‌లో తప్ప బహిరంగంగా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

అఖిలపక్షం పిలుపు మేరకు ఇంటర్మీడియట్ బోర్డు వద్ద తలపెట్టిన ధర్నాకు బయల్దేరిన తెలంగాణ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు రమణ  పోలీసులు అడ్డుపడి అరెస్టు చేశారు.ఆయనను  పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఇంటర్ బోర్డు ముట్టడికి పిలుపునిచ్చిన విపక్ష నేతలను ముందస్తుగా అరెస్ట్ చేయడంపై తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం తీవ్రంగా మండిపడ్డారు. అరెస్ట్‌లతో ఉద్యమాన్ని అణచివేయలేరని ఆయన అన్నారు. గత అర్థరాత్రి నుంచి ఎక్కడికక్కడ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారని,  విద్యార్థి సంఘాల నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

కాగా, ఇంటర్‌ బోర్డు కార్యాలయం నినాదాలు, నిరసనలతో దద్దరిల్లుతోంది. ఇంటర్‌ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించేందుకు వామపక్ష విద్యార్థి సంఘాల కార్యకర్తలు ప్రయత్నించారు. పెద్ద ఎత్తున విద్యార్థులు, విద్యార్థి నాయకులు  బోర్డు కార్యాలయం వద్దకు చేరుకుని కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు.  పోలీసులు వారిని అడ్డుకున్నారు. 

దీంతో బోర్డు కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నినాదాలు చేస్తూ ముట్టడికి దిగిన నిరసనకారులు, విద్యార్థులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు.

ఇంటర్ పరీక్షల ఫలితాలలో జరిగిన అవకతవకలకు నిరసనగా ఇంటర్ బోర్డ్ ఎదుట చేపట్టిన అఖిలపక్షం ధర్నాలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నేత రావుల.చంద్రశేఖరరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కూడా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డిని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు.