Asianet News TeluguAsianet News Telugu

president election 2022: ప్రజా చైతన్యం ప్రత్యక్షంగా చూశా... కేసీఆర్‌కు కృతజ్ఞతలు : జలవిహార్‌లో యశ్వంత్ సిన్హా

దేశంలో ప్రస్తుత పరిస్ధితుల గురించి తెలంగాణ సీఎం కేసీఆర్ చక్కగా వివరించారని అన్నారు రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్ధి యశ్వంత్ సిన్హా. తనకు మద్ధతు తెలిపినందుకు కేసీఆర్, కేటీఆర్ లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 

opposition president candidate yashwant sinha speech in jalavihar
Author
Hyderabad, First Published Jul 2, 2022, 2:34 PM IST

కేటీఆర్ (Kcr) ఢిల్లీకి వచ్చి తనకు మద్ధతు ప్రకటించారని అన్నారు విపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా (yashwant sinha). రాష్ట్రపతి ఎన్నికల (president election 2022) ప్రచారంలో భాగంగా ఆయన శనివారం హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా జలవిహార్ లో జరిగిన సభలో యశ్వంత్ సిన్హా మాట్లాడుతూ.. ఇక్కడికొచ్చాక ప్రజా చైతన్యం ప్రత్యక్షంగా చూశానని ఆయన వెల్లడించారు. మీ ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు అంటూ సిన్హా వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్, కేటీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు యశ్వంత్ సిన్హా. ప్రస్తుతం దేశంలో ఎలాంటి పరిస్ధితులు వున్నాయో కేసీఆర్ వివరంగా చెప్పారని సిన్హా అన్నారు. 

అంతకుముందు కేసీఆర్ మాట్లాడుతూ... నరేంద్ర మోదీ (narendra modi) దేశానికి ప్రధానిగా కాకుండా సేల్స్‌ మెన్‌లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మోదీ పాలనలో దేశ ప్రతిష్టను మసకబారేలా చేశారని ఆరోపించారు. యశ్వంత్ సిన్హాది ఉన్నత వ్యక్తిత్వం అని చెప్పారు. తెలంగాణ ప్రజల పక్షాన యశ్వంత్ సిన్హాకు హృదయపూర్వక స్వాగతం చెబుతున్నట్టుగా తెలిపారు. ఆయన వివిధ హోదాల్లో దేశానికి అత్యుత్తమ సేవలు అందించారని గుర్తుచేశారు. 

Also REad:ప్రధాని మోదీ సేల్స్‌మెన్‌గా వ్యవహరిస్తున్నారు.. మా ప్రశ్నలకు హైదరాబాద్ వేదికగా సమాధానం చెప్పండి: సీఎం కేసీఆర్

భారత రాజకీయాల్లో యశ్వంత్ సిన్హాది కీలక పాత్ర అని కేసీఆర్ అన్నారు. యశ్వంత్ సిన్హాకు అన్ని రంగాల్లో విశేష అనుభవం ఉందన్నారు. న్యాయవాదిగా కేరీర్ ప్రారంభించి ఆర్థిక మంత్రిగా సేవలందించారని గుర్తుచేశారు. ఆత్మప్రబోధానుసారం రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయాలని అన్నారు. అభ్యర్థులను బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఉత్తమ, ఉన్నతమైన వ్యక్తి రాష్ట్రపతిగా ఉంటే దేశ ప్రతిష్ట మరింత ఇనుమడిస్తుందని చెప్పారు. యశ్వంత్ సిన్హా గెలుస్తారనే విశ్వాసం ఉందన్నారు. ఆయన గెలిస్తే దేశ గౌరవం రెట్టింపు అవుతుందన్నారు. దేశానికి గుణాత్మక మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. 

ప్రధాని మోదీ వ్యవసాయ చట్టాలు తెచ్చి రైతులను ఇబ్బందిపెట్టారని విమర్శించారు. వ్యవసాయ చట్టాలపై రైతులు సుదీర్ఘ పోరాటం చేశారని గుర్తుచేశారు. ఉద్యమంలో దాదాపు 700 మంది రైతులు మృతిచెందారని అన్నారు. ఉద్యమంలో మృతిచెందిన రైతుల కుటుంబాలకు రూ. 3 లక్షలు అదజేశామన్నారు. రైతు కుటుంబాలకు సాయం చేస్తే బీజేపీ చులకనగా చూసిందన్నారు. రైతు చట్టాలు సరైనవే అయితే ఎందుకు వెనక్కి తీసుకున్నారని ప్రశ్నించారు. దేశంలో ఎరువులు, నిత్యావసరాలు, అన్ని రకాల ధరలు పెంచారని మండిపడ్డారు. రైతులు మీకు ఉగ్రవాదులు, వేర్పాటువాదులుగా కనిపిస్తున్నారా అని ప్రశ్నించారు. మోదీ ఎన్నికలప్పుడు తియ్యటి మాటలు చెబుతారని ప్రశ్నించారు. మోదీ తనను తాను మేధావిగా భావిస్తున్నారని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios