బిహార్ రాజధాని పాట్నాలో శుక్రవారం ప్రతిపక్షాలు సమావేశమై 2024 లోక్ సభ ఎన్నికల్లో ఐక్యంగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించాయి. ఈ సమావేశానికి బీఆర్ఎస్ హాజరు కాలేదు. ఈ భేటీపై స్పందనగా కోరగా.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర మంత్రి కే తారకరామా రావు కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టుల విషయాలు చర్చించడానికి ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ షింగ్, హర్దీప్ సింగ్ పురి, పియూష్ గోయల్‌లతో ఆయన సమావేశమై కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ రద్దవడంతో తెలంగాణకు వెనుదిరిగారు. ఆయన ఢిల్లీలో ఉన్నప్పుడు వార్తా ఏజెన్సీ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించారు.
బిహార్ రాజధాని పాట్నాలో నితీశ్ కుమార్ సారథ్యంలో 17 ప్రతిపక్ష పార్టీలు శుక్రవారం సమావేశమయ్యాయి. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీపై కలిసి పోరాడుతామని తీర్మానం చేశాయి. ఈ సమావేశానికి బీఆర్ఎస్‌కు ఆహ్వానం అందలేదు.
శుక్రవారం నాటి విపక్షాల భేటీపై కేటీఆర్ కామెంట్‌ను కోరగా.. ‘దేశం ముందు ఉన్న ప్రధామైన సమస్యలను ఆధారం చేసుకుని బీజేపీపై పోరాడాలి. దురదృష్టవశాత్తు మనం అసలు విషయాన్నే దాటవేస్తున్నాం. కేంద్రంలో ఒకరిని దించి, మరొకరిని అక్కడ ఆసీనులు చేయాలనే ఆతృతమే ఉన్నట్టు అర్థం అవుతున్నది. కానీ, అది అసలు ఎజెండా కాదు. ఎజెండా అనేది దేశానికి అవసరమైన కనీస ప్రాధాన్యాలను కేంద్రంగా చేసుకుని ఉండాలి. ఆ సమస్యలను నెరవేర్చేదిగా ఉండాలి’ అని కేటీఆర్ అన్నారు.
‘ఒక వ్యక్తి కోసం మీరంతా ఏకం కావాల్సిన అవసరం లేదు. ఒక అవసరం కోసం, ఒక పని కోసం ఏకం కావాలి. కానీ, ఆ ఒక్క అంశం ఏమిటీ? ఇదేవరికీ తెలియదు.’ అంటూ ప్రతిపక్షాలపై ఆయన కామెంట్ చేశారు.
అంతేకాదు, 2024 లోక్ సభ ఎన్నికలను బీఆర్ఎస్ ఒంటిగా పోటీ చేయబోతున్నట్టు కేటీఆర్ వెల్లడించారు. తమ పార్టీని మరింత విస్తరించాలని భావిస్తున్నామని, 2024 లోక్ సభ ఎన్నికల్లో బలంగా పోటీ చేసి ఢిల్లీ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో ఎంపీ సీట్లు గెలుచుకోవాలని ఆశిస్తున్నామని చెప్పారు. ఇప్పుడు తాము ఎవరికి పోటీగా, ఎవరి పక్షాన పోటీ చేయడం లేదని, తాము తమ పార్టీని విస్తరిస్తున్నామని వివరించారు.
Also Read: మేమంతా కలిసే పోటీ చేస్తాం: పాట్నా సమావేశానంతరం విపక్షాలు.. సిమ్లా భేటీలో తుది నిర్ణయాలు
దేశం ముందున్న ప్రధాన సమస్యలనే తమ పార్టీ ఎత్తుకుంటుందని కేటీఆర్ తెలిపారు. నేడు దేశంలో ఉపాధి కల్పన, రైతుల ఆదాయం, నీటి పారుదల, గ్రామీణ జీవణ ప్రమాణాలు వంటి అంశాలు చాలా ముఖ్యమైనవి. అంతేకానీ, హిజాబ్, హలాల్, మతం చుట్టూ నడిపే బక్వాస్ కాదని పేర్కొన్నారు. ఇలాంటి ఎజెండానే ప్రధానంగా పెట్టుకున్న పార్టీలతో తాము పొత్తు పెట్టుకుంటామని వివరించారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ కేంద్రంలో అధికారంలోకి వచ్చాయని, కాంగ్రెస్ 50 ఏళ్లు, బీజేపీ 15 ఏళ్లు అధికారాన్ని వెలగబెట్టాయని, కానీ, ఏం ఒరగబెట్టాయని అడిగారు. వాటి బాధ్యతను సంపూర్ణంగా నిర్వర్తిస్తే.. నేడు ఈ పరిస్థితులు ఉండేవి కావని అన్నారు. తాము తెలంగాణ ఆవిర్భవించిన స్వల్ప సమయంలోనే అద్భుతాలు చేస్తున్నామని, తెలంగాణ సంక్షేమ మాడల్‌నే దేశవ్యాప్తంగా విస్తరించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ విస్తరిస్తుందని కేటీఆర్ వివరించారు.
