Asianet News TeluguAsianet News Telugu

Asianet News Mood of the Nation Survey: తెలుగు రాష్ట్రాల్లోనూ మోదీదే హవా... మరి కాంగ్రెస్ పరిస్థితి?

ఏషియా నెట్ న్యూస్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డిఏ కూటమి మళ్ళీ గెలిచే అవకాశాలు తేల్చింది. చివరకు కాంగ్రెస్ పాలిత తెలంగాణలోనూ ప్రజలు ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేసారు.  

Opinion of Telugu people in Asianet News Mood of the Nation Survey 2024
Author
First Published Mar 27, 2024, 9:29 PM IST

హైదరాబాద్ : దేశవ్యాప్తంగానే కాదు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికల హడావిడి మొదలయ్యింది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలకు షెడ్యూల్ వెలువడటంతో రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. ప్రధాన పార్టీలన్ని ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి గెలుపు వేటలో పడ్డాయి. ఇలాంటి సమయంలో ఏషియానెట్ న్యూస్ లోక్ సభ ఎన్నికలపై ఆన్ లైన్ సర్వే నిర్వహించింది. ఏషియా నెట్ న్యూస్ నెట్ వర్క్స్ డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ (తెలుగు, ఇంగ్లీష్, హింది, మలయాళం, కన్నడ, తమిళ్, బంగ్లా, మరాఠీ) మార్చి 13 నుండి 27 వరకు లోక్ సభ ఎన్నికలపై సర్వే చేపట్టాయి. ఈ సర్వే ఫలితాలు ఇవాళ వెలువడగా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తికర అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.   

దేశంలో ప్రస్తుత పరిస్థితులు, రాజకీయాలకు సంబంధించి ప్రజలు చర్చించుకుంటున్న అంశాలపై సర్వే ప్రశ్నలను రూపొందించింది ఏషియా నెట్ న్యూస్. దేశంలో ప్రస్తుత పరిస్థితులను ప్రతిబింబించేలా ఈ ప్రశ్నలు వున్నాయి. ఈ సర్వే ఏషియా నెట్ న్యూస్ తెలుగులో కూడా సాగింది.  ఇందులో కాంగ్రెస్ పాలిత తెలంగాణ, వైసిపి పాలిత ఆంధ్ర ప్రదేశ్ లోనూ మోదీ సర్కార్ కు అనుకూల అభిప్రాయాలు వెలువడ్డాయి. 

కేంద్రంలోని ఎన్డిఏ సర్కార్ ఇటీవలే పౌరసత్వ సవరణ చట్టం తీసువచ్చిన విషయం తెలిసిందే. అయితే మోదీ ప్రభుత్వం సిఎఎపై తీసుకున్న నిర్ణయం రాబోయే లోక్ సభ ఎన్నికల్లో బిజెపికి కలిసిరానుందని సర్వేలో పాల్గోన్న 54.03 శాతం తెలుగు ప్రజలు అభిప్రాయపడ్డారు.  మరో 15.25 శాతం వ్యతిరేకంగా,  30.72 శాతం మంది ఎలాంటి ప్రభావం చూపదని అభిప్రాయపడ్డారు. మొత్తంగా చూసుకుంటే సిఎఎతో బిజెపి విజయావకాశాలు మెరుగుపడ్డాయని తెలుగు ప్రజలు భావిస్తున్నారు. 

ఇక ప్రధానమంత్రి పదవికి మళ్లీ నరేంద్ర మోదీయే అన్నివిధాలా కరెక్ట్ అని సర్వేలో పాల్గొన్న 79.31 శాతం తెలుగోళ్ల అభిప్రాయం. తెలంగాణలో ఇటీవలే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది... కానీ ఇక్కడ కూడా రాహుల్ గాంధీకి మద్దతు కరువయ్యింది. ప్రధానిగా రాహుల్ ను చూడాలనుకుంటున్నది కేవలం 15.52 శాతమే. ఇక నితీష్ కుమార్ 1.72 శాతం, మల్లిఖార్జున ఖర్గే  3.45 శాతం మంది ప్రధాని పదవికి ఎంపిక చేసారు. 

ప్రతిపక్ష INDI అలయన్స్ మోదీ హవాను తట్టుకుని నిలవలేదని సర్వేలో పాల్గొన్న అధికశాతం తెలుగోళ్ల అభిప్రాయం. ఏకంగా 73.80 శాతంమంది ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. INDI కూటమికి మద్దతుగా 17.34 శాతం మంది, ఏమీ చెప్పలేమని  8.86 శాతం ప్రజల అభిప్రాయం. కాంగ్రెస్ పాలిత తెలంగాణలో కూడా ఇలాంటి అభిప్రాయం వ్యక్తమవడం ఆశ్చర్యకరంగా వుంది. చివరకు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని మెరుగుపర్చలేదని 50.39 శాతంమంది అభిప్రాయం. 

మోదీ సర్కార్ సాధించిన అతిపెద్ద విజయం రామమందిర హామీ నెరవేర్చడం, డిజిటల్ ఇండియా అన్నది తెలుగోళ్ల అభిప్రాయం. 30.83 శాతం మందిది ఇదే అభిప్రాయం.   ఇక మౌలిక సదుపాయాలు అభివృద్ధి 25.19 శాతం, ఆత్మ నిర్భర్ భారత్ 13.16 శాతం ఓటేసారు. ఇక నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చిందని 61.62 శాతం తెలిపారు. లేదని 26.20 శాతం, ఏమీ చెప్పలేమని 12.18 శాతం మంది అభిప్రాయం. అవినీతిని అరికట్టడంతో మోదీ సర్కార్ సఫలమయ్యిందని  47.21 శాతం, లేదని 38.66 శాతం, ఏమీ చెప్పలేమని    14.03 శాతం అభిప్రాయం. 

మరోవైపు లోక్ సభ ఎన్నికలపై  రైతుల నిరసల ప్రభావం వుండబోదని  55.94 శాతం  అభిప్రాయపడ్డారు.  ప్రభావం చూపుతాయని 35.25 శాతం మంది పేర్కొన్నారు. ఇక లోక్ సభ ఎన్నికలకు ముందు దేశాన్ని ఉత్తర, దక్షిణాలుగా విభజించడం ఉద్దేశపూర్వకంగా జరుగుందని 35 శాతం, కాదని  55.94 శాతం మంది అభిప్రాయపడ్డారు. రామమందిరం లోక్ సభ ఎన్నికలపై ప్రభావం చూపుతుందని 81.74 శాతం,  ఏమీ చూపదని 16.60 శాతం మంది అభిప్రాయం. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీట్లను మెరుగుపర్చుకోలేదని  46 శాతం, అవకాశాలున్నాయని 45 శాతం మంది అభిప్రాయం.  

మోదీ హయాంలో అంతర్జాతీయ స్థాయిలో భారత్ మెరుగుపడిందని 78.78 శాతం మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. ఇక వచ్చే ఐదేళ్లలో  భారతదేశాన్ని పరిపాలించడానికి ఎవరు బాగా సరిపోతారని అడిగితే అత్యధికంగా 80.22 శాతం మంది ఎన్డీఏకు ఓటేసారు. INDI అలయన్స్ కేవలం 19.78 శాతం మంది మాత్రమే మద్దతుగా నిలిచారు.  

ఇదిలావుంటే నరేంద్ర మోదీ పాలనలో అతిపెద్ద పరాజయం ధరల పెరుగుదల 37.64 శాతం మంది అభిప్రాయం.  నిరుద్యోగిత 19.39 శాతం, మణిపూర్ వివాదంపై వ్యవహరించిన తీరు 27.38 శాతం, ఇందన ధరలు 15.59 శాతం మంది పరాజయంగా పేర్కొన్నారు. 

ఇక మోదీ సర్కార్ విదేశాంగ విధానాలకు 74.80 శాతం, ఎన్డిఏ పాలనలో మధ్యతరగతి ప్రజల జీవితాలు బాగుపడ్డాయని 58.76 శాతం మంది అభిప్రాయపడ్డారు. గల్వాన్ ఘటన తర్వాత చైనాను భారత్ ఎదుర్కొంటున్న తీరు బావుందని 63.79 శాతంమంది అభిప్రాయపడ్డారు. మరో 15.95 శాతం సంతృప్తికరంగా, 20.27 శాతం అసంతృప్తిగా వుందని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. 


 


 
 
 

Follow Us:
Download App:
  • android
  • ios