కంటికి రెప్పలా చూసుకుంటున్న చిన్నారులు కాస్త ఆదమరిస్తే చాలు కానరాని లోకాలకు పోతున్నారు. అలాంటి ఓ హృదయవిదారక సంఘటన హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో జరిగింది. అప్పటిదాకా అన్నం తినిపించిన తల్లి ఇంట్లోకి వెళ్లి వచ్చేసరికి  రెండున్నరేళ్ల చిన్నారి ఇంటిముందున్న సంపులో పడి మృతిచెందాడు. 

సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. 
పోలీసుల కథనం మేరకు.. ఖైరతాబాద్ డివిజన్, బీజేఆర్ నగర్ కు చెందిన ఉపేందర్, నాగేశ్వరి దంపతులకు అభినయ్ అనే రెండున్నరేళ్ల చిన్నారి ఉన్నాడు.  

ఉపేందర్ పని నిమిత్తం కొంతకాలంగా కర్నాటకలో ఉంటున్నాడు. ఇక్కడ నాగేశ్వరి ఒక్కతే కొడుకుతో రేకుల ఇంట్లో ఉంటోంది. మంగళవారం రాత్రి బాబుకు అన్నం తినిపించి ఇంట్లోకి వెళ్లింది. 

అరగంట తర్వత బైటికొచ్చి చూసేసరికి బాబు కనిపించలేదు. అతడికోసం గాలించగా నీటి సంపులో విగతజీవిగా కనిపించాడు. వెంటనే చిన్నారిని బైటికి తీసి, వాసవి  హాస్పిటల్‌కు, అక్కడి నుంచి నిలోఫర్‌ హాస్పిటల్‌కు తీసుకువెళ్లగా అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నీటి సంపు మీద కప్పు లేనందునే ప్రమాదవశాత్తు బాలుడు అందులో పడి చనిపోయి ఉంటాడని 
పోలీసులు భావిస్తున్నారు. ప్రతి ఒక్కరు సంపులపై మూతలు ఉండేలా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.