Asianet News TeluguAsianet News Telugu

బీజేపీ మాత్రమే రాష్ట్రంలో మార్పు తీసుకురాగలదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Hyderabad: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) ఒక్కటే అధికారంలోకి వస్తుందని చూస్తున్నారని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి అన్నారు. ప్రతి ఇంట్లో, ఆఫీసులో, ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లోని ఉద్యోగులు, ఇతరులలో బీజేపీ చర్చనీయాంశంగా మారిందని పేర్కొన్నారు. 
 

Only BJP can bring change in Telangana: Union Minister Kishan Reddy
Author
First Published Dec 4, 2022, 2:25 AM IST

Union Minister G Kishan Reddy: తెలంగాణలో భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) మాత్ర‌మే మార్పు తీసుకురాగ‌ల‌ద‌ని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు బీజేపీ మాత్రమే రాష్ట్రంలో అవసరమైన మార్పు తీసుకువస్తుందని అభిప్రాయ‌ప‌డుతున్నార‌ని తెలిపారు. బీజేపీ పార్ల‌మెంట్ స‌భ్యులు కే లక్ష్మణ్‌తో కలిసి ఆయన శనివారం హైద‌రాబాద్ లో ఏర్పాటు చేసిన స‌మావేశంలో ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవల ఢిల్లీలో బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి బీజేపీలో చేరిన తర్వాత తొలిసారిగా నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి రావడంతో ఆయన స్వాగతం పలికారు. ప్రతి ఇంట్లో, ఆఫీసులో, ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లోని ఉద్యోగులు, ఇతరులలో బీజేపీ చర్చనీయాంశంగా మారిందని అన్నారు.

విధాన రూపకల్పనలో శశిధర్ రెడ్డికి ఉన్న నైపుణ్యాన్ని వినియోగించుకుంటామనీ, హైదరాబాద్, తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడంలో పార్టీ కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. శశిధర్ రెడ్డికి చెందిన నాయకులు, మద్దతుదారులను ఆయన పార్టీలోకి ఆహ్వానించారు. వారంతా ఇప్పుడు బీజేపీ కుటుంబంలో భాగమేనన్నారు. ప్రజల కోసం పోరాడేందుకు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు మనమంతా అంకితమవుతామని కిషన్‌రెడ్డి ఉద్ఘాటించారు. సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వని స్థాయికి టీఆర్‌ఎస్‌ వచ్చిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో రాచరికంలా పాలిస్తున్న సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం అవినీతి బయటపడకూడదని చూస్తున్నార‌ని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలన్నీ మోసాలుగా మారుతున్నాయి. టీఆర్‌ఎస్ హయాంలో రాష్ట్రాన్ని తాగుబోతు, మోసాల తెలంగాణగా మార్చారని ఆరోపించారు.

 

టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల కవితకు సీబీఐ సమన్లు ​​జారీ చేయడంపై అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. "ఆమె ముఖ్యమంత్రి కుమార్తె అయినా.. చట్టానికి అతీతం కాదు.. చట్టానికి ఎవరూ అతీతులు కాదు.. చట్టం తన పని తాను చేసుకుంటుంది.. చ‌ట్టం, రాజ్యాంగం ముందు అందరూ సమానమే. కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ పనిని చేస్తున్నాయి" అని అన్నారు. ఏ తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలలో తప్పులు కనిపెట్టిన టీఆర్‌ఎస్‌పై ఆయన మండిపడ్డారు. రేపు మీరు తప్పు చేస్తే కోర్టులను ఆశ్రయించే స్థాయికి దిగజారిపోతారనిపిస్తోందన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రాజెక్టుల పేరుతో ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని, ఆ పార్టీ గ్రాఫ్ పడిపోతుందన్నారు.

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios