కరోనా లాక్ డౌన్ పుణ్యమాని అత్యవసర సేవలు తప్ప అన్ని కూడా మూసివేయబడ్డాయి. భక్తులు ఎక్కువగా చేరే అసుకరమున్న కారణంగా అన్ని ఆరాధనా స్థలాలను ప్రభుత్వం మూసేసింది. 

తిరుమల వెంకన్న నుంచి శ్రీశైలం మల్లన్న వరకు అన్ని గుడులు కూడా మూసివేయబడ్డాయి. ఆ గుళ్ళలో కేవలం ధూపదీప నైవేద్యాలు నడుస్తున్నాయి తప్ప, భక్తులకు మాత్రం అనుమతి లేదు. 

ఈ నేపథ్యంలో తెలంగాణలోని కొన్ని దేవాలయాలు పూజలను ఆన్ లైన్ లో ప్రారంభించాయి. ఈ మేరకు దేవాదాయ శాఖ ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది. దీని ప్రకారం తెలంగాణలో ఏప్రిల్ 17 నుంచి అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయని ప్రజలు వీటికోసం మీసేవ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. 

ఇక్కడొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... భక్తులు సేవ కోసం రిజిస్టర్ చేసుకున్న తరువాత పూజ నిర్వహించబడుతుంది. పూజ నిర్వహించిన తరువాత సదరు భక్తుడి ఫోన్ కి ఎస్ఎంఎస్ వస్తుంది. 

ఈ ఏడూ దేవాలయాల వివరాలు ఇలా ఉన్నాయి. 

 

1. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం, కాళేశ్వరం. 

2. శ్రీ తాడ్ బండ్ ఆంజనేయ స్వామి దేవాలయం 

3. శ్రీ జోగులాంబ దేవాలయం, గద్వాల్ 

4. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, శ్రీనగర్ కాలనీ, హైదరాబాద్ 

5. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం, కీసర 

6. శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం, చెర్వుగట్టు 

7. శ్రీ వెంకటేశ్వరా స్వామి దేవాలయం, జమలాపురం ఖమ్మం 

భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భగవంతుడి కృపకు పాత్రలు కాగలరని దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు.