హైదరాబాద్: ఆన్‌లైన్ రుణ యాప్‌ల విషయంలో నిందితుల నుండి పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించారు. నిందితుల నుండి మరింత సమాచారాన్ని సేకరించాల్సి ఉన్నందున కస్టడీని పొడిగించాలని సైబర్ క్రైమ్ పోలీసులు మరోసారి పిటిషన్ ను సోమవారం నాడు కోర్టులో దాఖలు చేశారు.

ఆన్‌లైన్ రుణ యాప్ ల విషయంలో  గతంలో అరెస్టైన ప్రధాన నిందితులు లాంబా, నాగరాజుల నాలుగు రోజుల కస్టడీ సోమవారం నాడు పూర్తైంది.

ఈ నాలుగు రోజుల్లో నిందితుల నుండి కీలక విషయాలను పోలీసులు సేకరించారు. రూ. 27 వేల కోట్ల స్కామ్ లో ప్రధాన నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న లాంబా మాత్రం ఈ విషయంలో తనకు సంబంధం లేదని చేతులెత్తేశాడు.

also read:ఇన్‌స్టంట్ యాప్‌లు: బెంగుళూరులో కీర్తి అరెస్ట్, చైనాలో నిర్వాహకుడు

కంపెనీ ఆర్ధిక లావాదేవీలు చేయడానికి ఓ ప్రత్యేక టీమ్ ఉంటుందని  పోలీసుల విచారణలో తెలిపాడు. ఆన్‌లైన్ రుణ యాప్ ల విషయంలో సీసీఎస్  లో కేసు నమోదైన సమయంలో  తన వద్ద ఉన్న  డేటాను లాంబా డిలీట్ చేశారు. 

ఈ సమాచారాన్ని పోలీసులు రికవరీ చేశారు. ఈ యాప్ ల ద్వారా ఆర్ధిక లావాదేవీలను ఓ మహిళ చేస్తోందని పోలీసులు గుర్తించారు. సీసీ జెన్నిఫర్ పేరుతో ఓ మహిళ  నకిలీ  పత్రాలతో ఇండియాకు వచ్చినట్టుగా సమాచారం. 

ఈ ఘటనలో నిందితుల కస్టడీ పొడిగింపునకు అనుమతి కోరుతూ సీసీఎస్ పోలీసులు మరోసారి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.