అంతర్జాతీయ బెట్టింగ్ ముఠా గుట్టును రట్టు చేశారు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు. ఆన్‌లైన్ ద్వారా బెట్టింగ్‌కు పాల్పడుతున్న గ్యాంగ్‌ను అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు.

ఓక్కో పేరుతో ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఓ కంపెనీ.. దేశవ్యాప్తంగా రూ.1,000 కోట్లకు పైగా లావాదేవీలు నిర్వహించింది ఈ చైనా కంపెనీ. ఈ కేసుకు సంబంధించి ఓ చైనా జాతీయుడితో పాటు నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆన్‌లైన్‌లో మోసాలకు పాల్పడుతున్న ఈ కంపెనీ.. పెద్ద మొత్తంలో డిపాజిట్లు సేకరించింది. టెలిగ్రాం యాప్ ద్వారా అడ్మిన్ సాయంతో ఆన్‌లైన్ బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఇప్పటికే ఈ ముఠా ఆగడాలపై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో రెండు కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. ఈ కంపెనీలో చైనా, ఇండియాకు చెందిన డైరెక్టర్లు ఉన్నారు. పలు బ్యాంక్ ఖాతాల్లోని రూ.30 కోట్లను సీజ్ చేసినట్లు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు.

ఈ కేసులో దర్యాప్తు సాగుతోందన్న ఆయన ఇందులో ఎంతోమంది మోసపోయి ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. ఇప్పటికైనా తల్లిదండ్రులు పిల్లలపై కన్నేసి ఉంచాలని అంజనీ కుమార్ సూచించారు.