వన్ సైడ్ లవ్‌స్టోరీ ఓ యువతి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. మైనర్ బాలిక ఓ యువకుడిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది. తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా అతని వెంటపడింది.

అయితే ప్రేమ, పెళ్లికి సదరు యువకుడు నిరాకరించడంతో ఆ యువతి తీవ్ర మనస్థాపానికి గురైంది. చివరికి అతని గదిలోనే ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్ కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన నగరంలో సంచలనం సృష్టించింది.

తమ కుమార్తెను చంపేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళానికి చెందిన చందర్ తన కుటుంబంతో కలిసి ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వలస వచ్చాడు.

అక్కడి ఓ కంపెనీలో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. చందర్‌కు ఇంటర్ చదువుతున్న 17 ఏళ్ల కుమార్తె రమ్య ఉంది. మూసాపేట ప్రాంతంలోని ఓ కాలేజీలో రమ్య ఇంటర్ చదువుతోంది.

ఈ క్రమంలో తన ఇంటిపక్కనే నివసిస్తున్న రాజు అనే యువకుడిని రమ్య ప్రేమిస్తోంది. అయితే తనకన్నా 12 ఏళ్లు చిన్నది కావడంతో ఆమెతో ప్రేమ, పెళ్లి కుదరదని తేల్చి చెప్పేశాడు.

రాజుతో తన ప్రేమ వ్యవహారం తేల్చుకుందామనని డిసైడ్ అయిన రమ్య.. అతని రూమ్‌లోకి వెళ్లింది. తనను ప్రేమించకుంటే చనిపోతానని బెదిరించింది. అందుకు ఒప్పుకోని రాజు ఆమెను బయటకు పంపేశాడు.

అయితే రాజు నిద్రలోకి జారుకున్న సమయంలో గదిలోకి ప్రవేశించిన రమ్య తాను అనుకున్నంత పని చేసింది. అతని రూమ్‌లోనే బలవన్మరణానికి పాల్పడింది. నిద్ర నుంచి లేచిన రాజు... రమ్య మృతదేహం చూసి షాకయ్యాడు.

వెంటనే కూకట్‌పల్లి పోలీసులకు సమాచారం అందించాడు. అయితే ప్రేమించలేదని రాజే తమ బిడ్డను చంపి, ఆత్మహత్యగా చిత్రీకరించాడని రమ్య తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి అనుమానాస్పద మృతిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.