సద్దుల బతుకమ్మ సంబరాలు జరగాల్సిన ఓ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. బతుకమ్మను పేర్చడానికి ఉపయోగించే పూల కోసం వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదానికి గురై మృతిచెందాడు. దీంతో సంతోషంగా పండగ జరుపుకోవాల్సిన గ్రామస్థులు దుఖ:లో మునిగిపోయారు. ఈ విషాద సంఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది.

ఇవాళ తెలంగాణ ప్రజలు వైభవంగా జరుపుకునే సద్దుల బతుకమ్మ పండగ ఉండటంతో  జైపూర్ మండలం టేకుమట్ల గ్రామానికి చెందిన బండారు రాజయ్య(52) బతుకమ్మ పూల కోసం పొలానికి వెళ్లాడు. ఈ క్రమంలో ఓ పొలంలో ప్రవేశించిన అతడు అడవి పందుల కోసం ఏర్పాటుచేసిన కరెంట్ తీగలను గమనించలేదు. దీంతో ప్రమాదవశాత్తు ఆ తీగలకు రాజయ్య తగలడంతో కరెంట్ షాక్ కొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మఈతి చెందాడు.

 రాజయ్య మరణ వార్త తెలియడంతో గ్రామంతో పండగ వాతావరణం మాయమై విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.