తెలంగాణ కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతున్నది. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఇద్దరు నాయకులకు షాక్ ఇచ్చింది. ఒకవైపు హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘానికి ఎన్నికల నోటిఫికేషన్ విషయంలో ఆరు వారాల పాటు ఎలాంటి ముందడుగు వేయరాదని స్టే ఇచ్చిన సమయంలో కొత్తగా ఎన్నికల సంఘం ఇచ్చిన షాక్ ఏంటబ్బా అనుకుంటున్నారా? చదవండి.

ఈనెల 23వ తేదీన రాజ్యసభ సభ్యుల ఎన్నిక కోసం ఎమ్మెల్యేల ఓటింగ్ జరగనుంది. దీనికోసం అసెంబ్లీలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణలో మూడు రాజ్యసభ సభ్యుల ఎన్నిక కోసం ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికోసం నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. అధికార టిఆర్ఎస్ తరుపున ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తరుపున మాజీ కేంద్ర మంత్రి ఒకరు నామినేసన్ వేసి ఉన్నారు. దీంతో ఏకగ్రీవం కాలేదు. ఎన్నికలు జరగనున్నాయి.

శుక్రవారం పోలింగ్ నేపథ్యంలో ఇప్పటికే సభలో సస్పెండ్ అయి ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ లకు ఓటు హక్కు కల్పించాలని అసెంబ్లీ కార్యదర్శికి కాంగ్రెస్ పార్టీ విన్నవించింది. దీనిపై అసెంబ్లీ కార్యదర్శి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. వీరికి ఓటు హక్కు ఉంటుందా? లేదా అన్నదానిపై క్లారిటీ ఇవ్వాలని లేఖలో కోరారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం రిప్లై ఇచ్చింది. పోలింగ్ తేదీ నాటికి సభలో సభ్యులుగా ఉన్న వారికి మాత్రమే ఓటు హక్కు ఉంటుందని, ఇద్దరు సభ్యులను సభనుంచి సస్పెండ్ చేసిన నేపథ్యంలో వారికి ఓటు హక్కు లేదని ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది.

దాంతోపాటు హైకోర్టు ఆదేశాలలో సభ్యుల సభ్యత్వ రద్దు విషయంలో స్పందించలేదని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. సభ్యత్వ రద్దు విషయంలో హైకోర్టు స్టే ఇచ్చి ఉంటే ఓటు హక్కు ఉండేదన్నట్లు ఎన్నికల సంఘం వివరణ ఇచ్చిందని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి. కేవలం ఖాళీ అయిన నల్లగొండ, అలంపూర్ అసెంబ్లీ సీట్ల భర్తీ కోసం తదుపరి చర్యలు మాత్రమే ఆరు వారాల పాటు నిలిపివేయాలని తమకు హైకోర్టు సూచించిందని తెలిపింది. దీంతో వారిద్దరికీ ఓటు హక్కు లేదని అసెంబ్లీ సెక్రటరీ కాంగ్రెస్ పార్టీకి వివరించారు.

అయితే తమకు ఓటు హక్కు కల్పించాలని, ఓటర్ల జాబితాలో తమ పేర్లు తొలగించడాన్ని నిరసిస్తూ నిన్న ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని సస్పెండ్ అయిన కోమటిరెడ్డి, సంపత్ లు కలిసి విన్నవించారు. ఓటర్ల జాబితాలో తమ పేర్లు చేర్చి ఓటు హక్కు కల్పించాలని సిఇసి రావత్ ను కోరారు. రాజ్యసభ ఎన్నికల వేళ అభ్యర్థికి ప్రతిపాదన సంతకాలు చేసిన తమకు ఓటు హక్కు లేకుండా కుట్రపూరితంగా సర్కారు వ్యవహరించిందని, సర్కారు కుట్రలకు ఈసి అనుకూలంగా వ్యవహరించరాదని వారు సూచించారు.