క్యాంపులో ఉన్న ఆ టీఆర్ఎస్ లీడర్లకు ఓమ్రికాన్ భయం..
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో క్యాంపులకు వెళ్లిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు కరోనా టెన్షన్ మొదలైంది. కొత్త వేరియంట్ బెంగుళూరులో బయటపడటంతో అక్కడే రిసార్ట్ లలో ఉన్న నాయకులు ఆందోళన చెందుతున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వివిధ రిసార్ట్స్‌లలో ఉన్న టీఆర్ఎస్ నాయకులకు కొత్త టెన్షన్ పట్టుకుంది. కొత్త వేరియంట్ భయం వారిని వేధిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ నుంచి అత్యధికంగా స్థానిక సంస్థల సభ్యులు ఉన్నప్పటికీ.. రెబల్స్ భయం వల్ల కొన్ని జిల్లాల నాయకులను క్యాంపులకు తరలించారు. ఎంపీటీసీ, జడ్పీసీలను మొదట హైదరాబాద్ లో కొన్ని రోజులు ఉంచి, తరువాత బెంగుళూరుకు తరలించారు. కరోనా కేసులు అక్కడే వెలుగులోకి రావడంతో వారిలో ఆందోళన మొదలైంది.
క్రాస్ ఓటింగ్ భయంతోనే క్యాంపులకు..
స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేసేందుకు గత నెలలో ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 10వ తేదీన ఈ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో స్థానిక సంస్థల సభ్యులైన ఎంపీటీసీ, జడ్పీటీసీలు ఓట్లు వేస్తారు. సాధారణంగా ఇందులో అధికార పార్టీ సూచించిన వ్యక్తులే ఎమ్మెల్సీలుగా ఎన్నికవుతూ ఉంటారు. తెలంగాణలో కూడా టీఆర్ఎస్ పార్టీకే స్థానిక సంస్థల సభ్యులు అధికంగా ఉన్నారు. అయితే ఈ సారి టీఆర్ఎస్‌కు ఆ పార్టీ నాయకుల నుంచి రెబల్స్ బెడద ఎక్కువైంది. తమకే ఎమ్మెల్సీ పదవి వరిస్తుందని ఆశించిన భంగపడిన పలువురు ఎమ్మెల్సీ బరిలో నిలిచారు. కొన్ని స్థానాల్లో అధికార పార్టీ ఏకగ్రీవం చేయించుకున్నప్పటికీ.. మరి కొన్ని స్థానాల్లో మాత్రం రెబల్స్ ను పోటీలో నుంచి తప్పించలేకపోయింది. దీంతో తమ పార్టీ నాయకులను బస్సుల్లో రిసార్టలకు తరలించింది.
మొదట హైదరాబాద్ లో కొన్ని రోజుల పాటు క్యాంపులు పెట్టింది. తరువాత గోవా, బెంగుళూరు వంటి ప్రాంతాలకు తీసుకెళ్లారు. అయితే ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్న ఆ పార్టీ నాయకులకు ఈ కొత్త వేరియంట్ వల్ల టెన్షన్ మొదలైంది. ఇండియాలో మొట్ట మొదటి సారిగా బెంగుళూరులోనే రెండు కరోనా కేసులు భయటపడటంతో అక్కడ రిసార్ట్‌లలో ఉన్న వారు ఆందోళన చెందుతున్నారు.
రిసార్ట్‌లలో అంతా కలిసే ఉండటం, ఎక్కడెక్కడి నుంచో బయటి వ్యక్తులు కలిసి వెళ్తూ ఉండటం వల్ల కరోనా ఎక్కడ తమపై ప్రభావం చూపుతుందో అని భయపడుతున్నారు.
కుటుంబ సభ్యుల నుంచి పెరుగుతున్న ఒత్తిళ్లు..
దాదాపు 10 రోజుల నుంచి ఎలాంటి టెన్షన్ లేకుండా గడిపిన నాయకులు ఒమ్రికాన్ వల్ల ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. వెంటనే తిరిగి ఇంటికి రావాలని కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిళ్లు ఎక్కువవుతున్నాయి. ఒమ్రికాన్ వేరియంట్ పట్ల ప్రపంచ దేశాలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో వారు మరింత కలవరపడుతున్నారు. అన్ని డబ్బులు పెట్టి పార్టీ రిసార్టలలో ఉంచినప్పటికీ.. పూర్తి స్థాయిలో ఆస్వాదించలేకపోతున్నారు. క్యాంపులలో ఉన్న నాయకులను డైరెక్ట్ ఎన్నికల రోజే తెలంగాణకు తీసుకొచ్చే అవకాశం ఉంది. దీంతో అన్ని రోజులు వారు అక్కడ ఎలా ఉండాలో అని మదనపడుతున్నట్టు సమాచారం. ఇది ఇలా ఉండగా క్యాంపులకు వెళ్లి వచ్చిన నాయకులు కరోనా పరీక్షలు చేయించుకోవాలని, తరువాత క్వారంటైన్‌లో ఉండాలని, ఆ తరువాతే గ్రామాల్లోకి అడుగుపెట్టానివ్వాలని గ్రామ స్థాయిలో చర్చ ప్రారంభమైంది.