తెలంగాణలోని కామారెడ్డి జిల్లా రామారెడ్డి‌లో విషాదం చోటుచేసుకుంది. కోతుల దాడిలో గాయపడిన ఓ వృద్దురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది.

తెలంగాణలోని కామారెడ్డి జిల్లా రామారెడ్డి‌లో విషాదం చోటుచేసుకుంది. కోతుల దాడిలో గాయపడిన ఓ వృద్దురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాలు.. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో చాతరబోయిన నర్సవ్వ (70) నివాసం ఉంటుంది. ఆమె చిన్న కుతూరు సుగుణ ఓ పెళ్లి వేడుకకు వెళ్లడంతో శుక్రవారం రోజున నర్సవ్వ ఇంట్లో ఒంటరిగా ఉంది. అయితే ఇంట్లో పాత్రలు శుభ్రం చేస్తున్న సమయంలో ఆమెపై కోతులు దాడి చేశాయి. దాదాపు 20కి పైగా కోతులు ఆమెపై దాడి చేశాయి. 

దీంతో నర్సవ్వ సహాయం కోసం కేకలు వేసింది. అయితే కోతులకు భయపడి ఇరుగుపొరుగువారు ఆమెను రక్షించే ప్రయత్నం చేయలేదు. వారు ఇళ్లకు తలుపులు వేసుకుని లోపలే ఉండిపోయారు. కోతులు దాడి చేస్తున్న సమయంలో కిందపడిన నర్సవ్వకు గాయాలు అయ్యాయి. అయితే కొద్దిసేపటికి ఇంటికి తిరిగివచ్చిన సుగుణ.. నర్సవ్వను ఆస్పత్రికి తరలించారు. ఛాతీ, వీపు, కాళ్లపై తీవ్ర గాయాల కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నర్సవ్వ శనివారం కన్నుమూసింది. 

ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నారు. కోతులు గ్రామంలోకి రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. చిన్నపిల్లలను కాపాడుకోవడం కష్టంగా మారుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.