వృద్ధురాలు, ఆమె 9యేళ్ల మనవరాలిని హత్య చేసి.. నగదు, బంగారం దోచుకున్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా నందిగామలో ఓ వృద్ధురాలిని.. ఆమెతో ఉండే 9యేళ్ల చిన్నారిని దారుణంగా హత్య చేశారు దుండగులు. శుక్రవారం సాయంత్రం వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో గంటల వ్యవధిలోనే పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు బీహారీ దంపతులైన దివాకర్, అంజలిగా గుర్తించారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

మృతురాలు పార్వతమ్మ, ఆమె మనవరాలిగా గుర్తించారు. పార్వతమ్మ 
లంబడి తండాలోని అంగన్ వాడీలో ఆయాగా పనిచేస్తుంది. ఆమెకు ఎవరూ లేరు. దీంతో సోదరుడి కుమారుడి కూతుర్ని తనకు తోడుగా ఉంచుకుంటోంది. కొద్ది రోజుల క్రితం పార్వతమ్మ ఇంట్లో కిరాయికి ఉన్నారు బీహారీ దంపతులైన దివాకర్, అంజలిలు. నెలరోజుల క్రితమే ఖాళీ చేసి పక్క గల్లీకి మకాం మార్చారు.

ఆ తరువాత పక్కా ప్లాన్ ప్రకారం ఆమె దగ్గరున్న నగదు, బంగారం దోచుకోవడానికి ఈ హత్యలు చేశారు. ఆమెకు ఎవ్వరూ లేకపోవడంతో సంపాదించిందంతా బంగారంకొన్ని దాచిందని.. నగదు కూడా ఉందని స్థానికులు చెబుతున్నారు. శుక్రవారం ఉదయం హత్యజరిగితే తమకు సాయంత్రానికి తెలిసిందని.. పోలీసులకు సమాచారం ఇచ్చామని చెబుతున్నారు. 

ఈ నందిగామా హత్య కేసును కేసును విచారించిన పోలీసులు.. గంటల వ్యవధిలోనే చేధించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.