ఓ వృద్ద దంపతులు తమలాంటి వుద్దులకు అండగా నిలిచేందుకు ఓ వృద్దాశ్రమాన్ని ఏర్పాటుచేశారు.  తమ సొంత స్థలంలో, సొంత ఖర్చులతో భవనాన్ని నిర్మించి పిల్లల ప్రేమను కోల్పోయిన, అనాథలైన వృద్దులకు సకల సౌకర్యాలు కల్పించారు. అయితే ఆశ్రమ నిర్వహకులకు కూడా వయస్సు మీద పడటంతో నిర్వహన వ్యవహారాలు చూసుకోలేక...ఆశ్రమాన్ని అలాగే వదిలేయలేక ప్రభుత్వం సాయం కోరారు. మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ను కలిసి తాము స్థాపించిన వృద్దాశ్రమాన్ని ప్రభుత్వ నిర్వహణలోకి తీసుకోవాలని కోరారు. 

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పెద్ద కొండూరు గ్రామానికి చెందిన మేరెడ్డి సత్యనారాయణ రెడ్డి, జానకమ్మ దంపతులు తమ గ్రామంలోనే ''జానకమ్మ వానప్రస్థ ఆశ్రమం'' పేరుతో ఓ వృద్దాశ్రమాన్ని ఏర్పాటుచేశారు. దాదాపు ఎకరంన్నర భూమిలో దాదాపు ఆరు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాన్ని సొంత ఖర్చులతో నిర్మించారు. అందులో నిరాశ్రయులైన, పిల్లల ఆదరణ కోల్పోయిన వృద్దులకు ఆశ్రయం కల్పిస్తూ ఈ జంట ఆదర్శంగా నిలిచారు. 

అయితే వీరికి కూడా వయస్సే మీద పడటంతో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. దీంతో ఆశ్రమాన్ని నిర్వహించడం కష్టంగా మారడంతో ప్రభుత్వ సాయాన్ని కోరారు. దాదాపు కోటి రూపాయల విలువైన ఆశ్రమాన్ని ప్రభుత్వానికి అప్పగించేందకు సిద్దమయ్యారు. 

వృద్దాశ్రమాన్ని ప్రభుత్వానికి విరాళం ఇస్లున్నట్లు ప్రకటించిన నిర్వహకులు వృద్ధులకు సేవలు కొనసాగేలా చూడాలని  కేటీఆర్‌ని కోరారు. దీనిపై స్పందించిన కేటీఆర్...స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ తో మాట్లాడతారని...మీరు ప్రారంభించిన ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగించేలా ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ తో కూడా కేటీఆర్ మాట్లాడారు.  

వీడియో

"

"