Asianet News TeluguAsianet News Telugu

చలిమంట కాచుకుంటుండగా ఫిట్స్.. మంటలంటుకుని వృద్ధుడి సజీవదహనం..

చలితీవ్రతనుంచి కాపాడుకోవడానికి వేసుకున్న చలిమంట ఆ వృద్ధుడి పాలిట మృత్యుపాశంగా మారింది. చలికాచుకుంటుండగా ఫిట్స్ రావడంతో మంటల్లో పడి మరణించాడు. 

old age man burnt alive in camp fire at nagarkurnool district
Author
First Published Nov 14, 2022, 8:29 AM IST

నాగర్ కర్నూల్ : తెలంగాణలోని నాగర్ కర్నూల్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలో చలితీవ్రత విపరీతంగా పెరిగిపోయింది. దీనినుంచి తప్పించుకునేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే చలి తీవ్రతను తప్పించుకోవడానికి చలిమంట వద్ద చలి కాచుకుంటున్న ఓ వృద్ధుడికి నిప్పంటుకుంది. దీంతో ఆ వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని ఉయ్యాలవాడలో ఆదివారం చోటు చేసుకుంది. 

స్థానికుల కథనం ప్రకారం.. ఉయ్యాలవాడకు చెందిన వెంకటయ్య (60) ఆదివారం వేకువజామున 4 గంటల ప్రాంతంలో నిద్రలేచి.. తన ఇంటి ఆవరణలో చలిమంటలు పెట్టుకున్నాడు. చలి కాచుకుంటున్న సమయంలో ఫిట్స్ రావడంతో ప్రమాదవశాత్తు మంటల్లో పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. ఉదయం కుటుంబసభ్యులు లేచి చూసేసరికే మృతి చెంది ఉన్నాడు. అతడికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఈ సంఘటనపై ఎలాంటి ఫిర్యాదు రాలేదని ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు. 

రికార్డు స్థాయిలో ఒక్కరోజే కోటికి పైగా ఆదాయం.. యాదాద్రి ఆలయ చరిత్రలోనే మొదటిసారి..

ఇదిలా ఉండగా, అక్టోబర్ 12న ఇలాంటి ఘటనే నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. చలి తీవ్రతను తట్టుకునేందుకు ఓ రైతు పొలంలో చలిమంట వేసుకున్నాడు. అదే అతనికి చితిమంట అయ్యింది.  నిర్మల్ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది.  భైంసా మండలం ఎగ్గాంకు చెందిన భూమన్న (70)..  పందుల బారి నుంచి పంటను కాపాడుకునేందుకు ఎప్పట్లాగే ఆ రోజు రాత్రి కూడా పొలానికి కాపలాగా వెళ్ళాడు. చలి అధికంగా ఉండడంతో పొలంలోని షెడ్డులో  చలిమంట వేసుకున్నాడు. దానికి పక్కనే మంచంపై పడుకున్నాడు.

అయితే అర్ధరాత్రి తర్వాత ఆ చలిమంట రగిలి.. షెడ్డుకు నిప్పు అంటుకుంది. షెడ్డులోని కట్టెలు, గడ్డి వంటివి అంటుకుని మంటలు వ్యాపించాయి. వాటిల్లోనే భూమన్న కూడా కాలిపోయాడు. తెల్లవారి ఉదయం వ్యవసాయ పనుల కోసం అటుగా వచ్చిన కొందరు జరిగిన ప్రమాదాన్ని గుర్తించి భూమన్న కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. 

ఇదిలా ఉండగా, నిరుడు డిసెంబర్లో ఓ దొంగ వణికించే చలి నుంచి కాపాడుకోవడానికి  నివ్వెరపోయే పనిచేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి  దొంగతనాన్ని వృత్తిగా ఎంచుకున్నాడు. చాలా బైక్లను దొంగతనం చేసేవాడు. వాటన్నింటినీ ఒక చోట దాచి పెట్టేవాడు. నిరుడు డిసెంబర్లో చలి మామూలుగా లేదు. దొంగకు కూడా బాగా చలి వేసేసింది. చలిమంట వేసుకుందామని ఎంత వెతికినా కర్రముక్క లాంటివి ఏమీ కనిపించలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు… కళ్ళెదుట తాను దొంగతనం చేసి తీసుకొచ్చిన బైక్ లు కనిపించాయి. దాంట్లో ఒక దానికి  నిప్పంటించి చలికాచుకుంటే సరిపోతుంది కదా అనే ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా ఒక బైక్ పక్కకు తీసుకొచ్చి, దాని మీద కొంత పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దాంతో చలి కాచుకున్నాడు. ఖరీదైన చలిమంట ఘటన మహారాష్ట్రలోని నాగపూర్ లో చోటుచేసుకుంది. ఈ ఘటన  కొద్దిరోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది.అది కూడా పోలీసులు  బైకు దొంగతనాల విషయంలో సీరియస్ గా దర్యాప్తు చేపట్టడంతో  ఆ దొంగను పట్టుకున్నారు. ఈ క్రమంలో వాహనాల గురించి ఆరా తీయగా విషయం బయటపడింది.

Follow Us:
Download App:
  • android
  • ios