T Harish Rao:  తెలంగాణ ప్ర‌భుత్వం రైతుల సంక్షేమం కోసం అన్ని ర‌కాల చ‌ర్యలు తీసుకుంటున్న‌ద‌ని రాష్ట్ర ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు అన్నారు. సంప్ర‌దాయేత‌ర పంట‌ల‌తో రైతుల‌కు మంచి లాభాలు ఉంటాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు.  

Telangana: వరి, ఇతర సంప్రదాయ పంటల కంటే సంప్ర‌దాయేత‌ర పంట‌ల‌తో రైతుల‌కు మంచి లాభాలు ఉంటాయ‌ని రాష్ట్ర ఆర్థిక మంత్రి హ‌రీశ్ రావు అన్నారు. రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌ సాగు పెరుగుతున్న‌ద‌ని తెలిపారు. అయిల్ ఫామ్ సాగుతో కూడా రైతులు మంచి లాభాలు పొందవచ్చని మంత్రి పేర్కొన్నారు. రైతులు ఎకరాకు ఏడాదికి రూ.1.5 లక్షల వరకు లాభం పొందుతున్నార‌ని తెలిపారు. అదే వ‌రి పంట‌కు సాధారణంగా రూ.25,000 లాభం మాత్ర‌మే వ‌స్తున్న‌ద‌ని తెలిపారు. బుధవారం నాడు నంగనూరు మండలం నర్మెటలో వ్యవసాయ శాఖ మంత్రి ఎస్‌.నిరంజన్‌రెడ్డి, టీఎస్‌ ఆయిల్‌ఫెడ్‌ చైర్మన్‌ కే రామకృష్ణారెడ్డి సమక్షంలో ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసిన అనంతరం శిక్షణా కార్యక్రమంలో మంత్రి హ‌రీశ్ రావు మాట్లాడుతూ.. పై వ్యాఖ్య‌లు చేశారు. 

ఆయిల్‌పామ్‌ రైతులకు ప్లాంటేషన్‌, డ్రిప్‌ సౌకర్యంపై రూ.80వేలు సబ్సిడీ ఇస్తున్నామని, కోతులు, అడవిపందుల నుంచి ఎలాంటి ముప్పు ఉండదని హ‌రీశ్‌ రావు తెలిపారు. సిద్దిపేటలో రైతులు ఇప్పటి వరకు 3 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు చేశారనీ, మరో 20 వేల ఎకరాలకు సరిపడా నారుమళ్లు సిద్ధంగా ఉన్నాయని వెల్ల‌డించారు. 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీని సిద్దిపేటలో ఆయిల్‌పామ్‌ పంట దిగుబడిని సులభతరం చేసే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంమీద తెలంగాణలో ఇది మూడో ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ అని తెలిపారు. తెలంగాణ స‌ర్కారు రైతుల సంక్షేమ కోసం అన్ని ర‌కాల చర్య‌లు తీసుకుంటున్న‌ద‌ని స్ప‌ష్టం చేశారు. సిద్దిపేటలో అయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కావటం సంతోషంగా ఉందని తెలిపారు. రాష్ట్రం విడిపోతే తెలంగాణ ఏడారి అవుతుందనీ, అంధకారంలో నిండిపోతుందని ఉమ్మడి ఏపీ నేతలు పేర్కొన్నారు. అయితే, స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత కరెంట్ కోతలు లేకుండా మన ముఖ్యమంత్రి కేసీఆర్ 24 గంటల కరెంటును అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర రైతాంగానికి నీరు అందించడం కోసం అనేక ప్రాజెక్టులు చెపట్టారనీ, రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రీ కేసీఆర్ దేనని అన్నారు. 

భారతదేశం విదేశాల నుండి పెద్ద మొత్తంలో పామాయిల్ మరియు ఇతర వంట నూనెలను దిగుమతి చేసుకుంటుందని రైతులకు అవగాహన కల్పిస్తూ, పామాయిల్ రైతులు మూడు దశాబ్దాలకు పైగా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే సాధారణ ఆదాయాన్ని పొందవచ్చని మంత్రి హ‌రీశ్ రావు అన్నారు. పామాయిల్ సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించిన మంత్రి.. తమ గ్రామాల్లోని రైతులు ఆయిల్ పామ్ సాగును చేపట్టేలా మార్గనిర్దేశం చేయాలని పిలుపునిచ్చారు. TSIIC (తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్) స్వాధీనం చేసుకున్న 60 ఎకరాల భూమిలో 300 కోట్ల రూపాయల వ్యయంతో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని నిర్మించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మెదక్‌ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ రోజా శర్మ తదితరులు పాల్గొన్నారు.

Scroll to load tweet…