అపాయంలో ఉన్న వారిని రక్షించాల్సిన పోలీసే.. భక్షకుడిగా మారాడు.  కోరిక తీర్చాలంటూ ఓ యువతిని వేధించాడు.  తన కోరిక తీర్చకుంటే యాసిడ్ పోస్తానంటూ బెదిరించాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని వనస్థలీపురంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

వనస్థలీపురానికి చెందిన ఓ యువతి గతంలో వరంగల్ లో ఫుడ్ ఇన్ స్పెక్టర్ గా పనిచేశారు. కొన్నేళ్ల క్రితం తన పదో తరగతి సర్టిఫికెట్లు పోవడంతో ఫిర్యాదు చేయడానికి మిర్యాలగూడ పోలీసుస్టేషన్‌కు వెళ్లారు.

ఈ నేపథ్యంలోనే అప్పట్లో అక్కడ ఎస్సైగా పని చేస్తున్న చంద్రకుమార్‌తో బాధితురాలికి పరిచయమైంది. ఆ సర్టిఫికెట్లు రికవరీ చేసి ఇచ్చిన చంద్రకుమార్‌ అప్పటి నుంచి అప్పుడప్పుడు బాధితురాలికి ఫోన్లు చేయడం, సందేశాలు పంపడం చేసేవాడు. ఐదేళ్ల క్రితం ఆమె వ్యక్తిగత పనికి సంబంధించిన ఫైల్‌ను సచివాలయంలో క్లియర్‌ చేయిస్తానంటూ రూ.5 లక్షలు తీసుకున్నాడు. ఆ తర్వాత యాచారం ఇన్‌స్పెక్టర్‌గా బదిలీపై వచ్చిన చంద్రకుమార్‌ బాధితురాలికి తరచూ ఫోన్లు, ఎస్సెమ్మెస్‌లు పంపుతూ వేధించడం మొదలుపెట్టాడు.

చంద్రకుమార్ ను అరెస్టు చేయకపోవడంపై బాధిత మహిళ విమర్శలు చేస్తోంది. ఎఫ్ఐఆర్ నమోదై 3 రోజులైనా అరెస్టు చేయకపోవడమేమిటని ప్రశ్నిస్తోంది.

తన కోరిక తీర్చాలంటూ తరచూ వేధించాడు. నగ్నంగా వీడియో కాల్ చేయాలంటూ కోరేవాడు. దీంతో.. సదరు బాధితురాలు అతనిని దూరం పెట్టడం మొదలుపెట్టింది. దీంతో.. తన కోరిక తీర్చకుంటే యాసిడ్ పోస్తానంటూ బెదిరించడం మొదలుపెట్టాడు.

బాధితురాలు రాచకొండ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా అతడికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. బాధితురాలి జోలికి వెళ్లనని, ఆమె నుంచి తీసుకున్న నగదు కూడా తిరిగి ఇచ్చేస్తానంటూ చెప్పి చర్యల నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత కూడా ఇన్‌స్పెక్టర్‌ తన ధోరణి మార్చుకోలేదు. బాధితురాలికి నగ్నంగా వీడియో కాల్స్‌ చేయడం మొదలెట్టాడు.

దీంతో.. బాధితురాలు మరోసారి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా.. అతనిని సస్పెండ్ చేశారు. సదరు ఇన్ స్పెక్టర్ పై చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.