గుప్తనిధుల మోజు ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. దీనికోసం ఎంతదూరమైనా వెడతారు, దేనికైనా తెగిస్తారు. తాజాగా ఖమ్మంలో గుప్త నిధుల కోసం క్షుద్ర పూజలు, బాలిక అదృశ్యం కలకలం రేపుతోంది. గుప్తనిధుల కోసం బలిచ్చారేమో.. అనే పుకార్లు వ్యాపిస్తున్నాయి. 

ఏపీ-తెలంగాణ‌ సరిహద్దులోని ఎర్రుపాలెం మండలంలోని రేమిడిచర్ల గ్రామానికి చెందిన నరసింహ్మారావు ఇంట్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగాయి. గత 20 రోజులుగా ఈ త‌వ్వ‌కాలు సాగుతున్నాయి. ఇంట్లో పెద్ద గొయ్యిని తవ్వారు. ఈ సమాచారం తెలిసిన పోలీసులు గత రాత్రి నరసింహారావు ఇంటికి వెళ్లారు. అప్పటికే పోలీసులు వచ్చే విషయం తెలుసుకున్న నరసింహ్మారావు కుటుంబం గుప్త నిధుల ఆనవాళ్లు లేకుండా చేశారు. అంతే కాకుండా ఆ ప్రాంతానికి, ఇంటి వైపు వెళ్లకుండా కుటుంబ సభ్యులు అడ్డుకుంటున్నారు. 

దీనికి ఊతమిస్తూ నరసింహారావు మేనకోడలు 16 ఏళ్ల బాలిక రాజశ్రీ మూడు రోజులుగా కనిపించకుండా పోయింది. రాజశ్రీ హైదరాబాద్ లో చదువుకుంటోంది. అయితే, ఇప్పుడు ఆ బాలిక కనిపించకుండా పోయింది. తనకు చదువుకోవాలని ఉంని చెబుతూ.. ఆ బాలిక ఓ లెటర్ రాసి మూడురోజుల క్రితం బయటకు వెళ్లిపోయిన‌ట్టుగా చెబుతున్నారు. ఆ బాలిక ఆచూకి కనిపించడం లేదు. ఇంతకీ ఆ బాలిక ఏమైంది అనేది తెలయడం లేదు. 

నాలుగు రోజుల క్రితం నుంచి బెంగుళూర్ నుంచి ఒక‌రు వచ్చి గుప్త నిధుల కోసం పూజలు చేస్తున్నారని గ్రామంలో ప్రచారం జ‌రుగుతోంది. దీనికి తోడు బాలిక కనిపించకుండా పోవడంతో గుప్తనిధుల కోసం బలిచ్చారనే ప్రచారం ఊపందుకుంటోంది. 

ఈ మేరకు బాలిక తల్లి రాణి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. 
అయితే, ఈ కేసు వ్యవహారంలో పోలీసులు చాలా గోప్యత కొనసాగిస్తున్నారన్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. విచారణ కోసం నిందితులను పోలీసు స్టేషన్ కు రావలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. 

మ‌రోవైపు.. గుప్తనిధులు ఉన్నాయన్న అత్యాశతో క్షుద్ర పూజలు నిర్వహిస్తూ ఓ మైనర్ బాలికను బలి ఇచ్చేందుకు సిద్ధం చేశారన్న విషయం ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతోంది. గడిచిన 20 రోజులుగా ఈ తంతు కొనసాగుతుండగా,  మైనర్ బాలిక అదృశ్యం నేపథ్యంలో తల్లి ఫిర్యాదు తో ఈ విషయం వెలుగులోకి వ‌చ్చింది.