Asianet News TeluguAsianet News Telugu

నాంపల్లిలో నేటి నుంచి నుమాయిష్‌.. ఈ రూట్స్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. పూర్తి వివరాలు ఇవే..

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో 82వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్‌)-2023 నేడు ప్రారంభం కానుంది. 

numaish will start today traffic restrictions ticket price and other details here
Author
First Published Jan 1, 2023, 1:57 PM IST

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో 82వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్‌)-2023 నేడు ప్రారంభం కానుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు తెలంగాణ మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి నుమాయిష్‌ను ప్రారంభించనున్నారు. 45 రోజుల పాటు జరిగే ఈ ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 15న ముగియనుంది. ప్రతిరోజూ మధ్యాహ్నం 3:30 గంటల నుంచి రాత్రి 10:30 వరకు ప్రదర్శన జరుగుతుంది. సందర్శకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎగ్జిబిషన్‌ను సురక్షితమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. 

నుమాయిష్‌లో ఈసారి దాదాపు 2400 స్టాల్స్‌ను ఏర్పాటు చేశామని.. స్టాళ్ల మధ్య తగినంత దూరం ఉండేలా జాగ్రత్త పడినట్టుగా నిర్వహకులు చెప్పారు. సందర్శకుల కోసం ఉచిత పార్కింగ్ తో పాటు వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వైద్య శిబిరం, కోవిడ్ భద్రతా ఏర్పాట్లు, సీనియర్ సిటిజన్లకు వీల్‌చైర్ సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయని చెప్పారు. ప్రవేశ రుసుమును రూ.40 గా నిర్ణయించామని.. ఐదేళ్లలోపు చిన్నారులను ఉచితంగా అనుమతిస్తామని తెలిపారు. పిల్లలు, పెద్దలు ఆనందించేలా అమ్యూజ్‌మెంట్ పార్కును కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 

ట్రాఫిక్ ఆంక్షలు.. 
నుమాయిష్ సందర్భంగా పోలీసులు నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఆదివారం నుంచి ఫిబ్రవరి 15 వరకు ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు.
- సిద్దిఅంబర్‌ బజార్‌, జాంబాగ్‌ నుంచి నాంపల్లి వైపు వెళ్లే డిస్ట్రిక్ట్‌ ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు, ఇతర భారీ వాహనాలను మొజాంజాహి మార్కెట్‌ వద్ద వద్ద అబిడ్స్ వైపు మళ్లిస్తారు.
-పోలీస్ కంట్రోల్ రూమ్, బషీర్ బాగ్ నుంచి నాంపల్లి వైపు వచ్చే భారీ ట్రాఫిక్‌ను ఏఆర్ పెట్రోల్ పంప్, బీజేఆర్ విగ్రహం నుంచి అబిడ్స్ వైపు మళ్లిస్తారు.
-బేగంబజార్ ఛత్రి నుంచి మాలకుంట వైపు వెళ్లే ట్రాఫిక్‌ను అలస్కా జంక్షన్ వద్ద దారుస్సలాం, ఏక్ మినార్ మీదుగా నాంపల్లి వైపునకు అనుమతిస్తారు. అదే విధంగా అఫ్జల్‌గంజ్ లేదా అబిడ్స్ వైపు వెళ్లే ట్రాఫిక్ అలస్కా వద్ద బేగంబజార్, సిటీ కాలేజీ, నయాపూల్ వైపు మళ్లించబడుతుంది.
-బహుదూర్‌పురా, మూసాబౌలి నుంచి నాంపల్లి వైపు వెళ్లే ట్రాఫిక్‌ను సిటీ కాలేజీ వద్ద నయాపూల్, ఎంజే మార్కెట్ వైపు మళ్లిస్తారు.

ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. 
నుమాయిష్‌ను దృష్టిలో పెట్టుకొని గ్రేటర్ ఆర్టీసీ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు ప్రత్యేక బస్సులను నడపనుంది. గ్రేటర్‌లోని పలు ప్రాంతాల నుంచి నుమాయిష్‌ వెళ్లే వారి కోసం ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టుగా ఆర్టీసీ అధికారులు చెప్పారు. నుమాయిష్‌కు వచ్చే సందర్శకుల సంఖ్యకు అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడుపుతామన్నారు. జనవరి 1 నుంచి 12వ తేదీ వరకు 111బస్సులను నడపనున్నట్టుగా చెప్పారు. ఆ తర్వాత నుంచి ఫిబ్రవరి 15 వరకు పని దినాల్లో 164 బస్సులు, సెలవు రోజుల్లో 218 బస్సులను నడపనున్నట్లు అధికారులు తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios