తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు. 

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, ఇతర ప్రముఖులు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్నారు. ఈరోజు ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరకున్న పలువురు తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్‌కు నివాళులర్పించినవారిలో మంత్రులు మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, మోత్కుపల్లి నర్సింహులు, అరికపూడి గాంధీ, మాగంటి గోపినాథ్ తదితరులు ఉన్నారు. 

ఈ సందర్భంగా నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు ఉండాలనే ఆలోచన చేసిన మహా నాయకుడు ఎన్టీఆర్ అని గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో డిమాండ్ చేస్తామని చెప్పారు. 

మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. తెలుగు బిడ్డకు నివాళులు అర్పించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని అన్నారు. దేశంలో తెలుగువారు ఎక్కడున్నా కీర్తి తెచ్చిపెట్టిన ఘనత ఎన్టీఆర్‌దేనన్నారు. సినిమా నటుడిగానే కాకుండా రాజకీయ నాయకుడిగా చరిత్ర సృష్టించిన నాయకుడు ఎన్టీఆర్ అని చెప్పారు. మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ.. భారతదేశంలో రాజకీయాలకు ఒక నూతన నిర్వచనం ఇచ్చిన మహానాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు. పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి రావడమే కాకుండా.. రాజకీయ విధానాన్ని సమూలంగా మార్చేసిన మహానాయకుడని చెప్పారు. 

ఇక, ఈ రోజు తెల్లవారుజామునే ఎన్టీఆర్ మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‎లు ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకుని నివాళులర్పించారు. ఎన్టీఆర్ సమాధి వద్ద పుష్పగుచ్చాలు ఉంచి తాతను స్మరించుకున్నారు. ఎన్టీఆర్ కుమార్తెలు, కుమారులు, ఇతర కుటుంబ సభ్యులు కూడా ఎన్టీఆర్ ఘాట్‌కు చేరకుని నివాళులర్పించారు. నందమూరి రామకృష్ణ, దగ్గుబాటి పురందేశ్వరి దంపతులు.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పురందేశ్వరి తన తండ్రిని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు.